Tuesday, September 26, 2023

Katha Utsavam - 2023 Unudurti Sudhakar

 సెప్టెంబరు 23-24 తేదీలలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, దిగిడి గ్రామం, జహీరాబాద్‌ సమీపంలో జరిగిన కథా ఉత్సవం-2023: కొన్ని విశేషాలు సంక్షిప్తంగా - ఉణుదుర్తి సుధాకర్

మొదటి రోజు

సెషన్-1: కొంతకాలంగా వ్రాస్తూన్న రచయితల అనుభవాలు

ప్రచురణల్లో ఎడం, విరామం రాకూడదనే ఆరాటంతో బాటుగా తమ ఇతివృత్తాల పరిధిని విస్తరించుకొనే ప్రయత్నం (ఇండ్ల చంద్రశేఖర్). 

కథావస్తువులో భిన్నత్వంవైపుగా ప్రయాణం. మాండలిక ప్రయోగాలకు పాఠకుల స్పందనపై సందేహాలు (ఝాన్సీ పాపుదేశి).

'ఇసుక అద్దం' సంపుటికి వచ్చిన స్పందన ఉత్సాహం నింపినప్పటికీ, ఆ తరువాత నిరుత్సాహం. కొత్త కథాంశాలపై, ముఖ్యంగా సమకాలీన మహిళల సమస్యలపై వ్రాయాలనే అభిలాష (ఊహ).

ప్రధానంగా 'నోస్టాల్జియా’ కథలతో కూడిన 'పార్వేట’ సంపుటికి లభించిన అనూహ్యమైన స్పందన. రాయలసీమ ప్రాంత కథలపై దృష్టిపెట్టాలనే స్పష్టత, పట్టుదల (శీలం సురేంద్ర).


సెషన్-2: కథా రచన, సామాజిక కార్యాచరణ

పాలకులే సామాజిక సంక్షోభాలనూ, పోరాట సందర్భాల్నీ ఎప్పటికప్పుడు సృష్టిస్తూవస్తున్నారు. స్పందన అనివార్యం. అందుచేత రచనలన్నీ రాజకీయ ప్రకటనలే. సామాజిక కార్యాచరణలో చురుగ్గా పాల్గొన్నప్పుడల్లా రచనలకై సమయాన్ని కేటాయించడం దాదాపుగా అసాధ్యం. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండడం మూలాన కథా వస్తువులకు లోటులేదు. దృక్పథం ఎట్లానూ ఉన్నది. రచనా శైలి, శిల్పం వీటికి మరింత సమయాన్ని కేటాయించాలి. ఇటీవల వ్రాసిన కొన్ని కథలు అసంతృప్తిని కలిగించాయి (పసునూరి రవీందర్).

సామాజిక కార్యాచరణ రచనలకు కేటాయించగల సమయాన్ని నియంత్రిస్తున్నది. అయితే కార్యాచరణ నుండి తెలుసుకున్న విషయాలను, సమకాలీన అంశాలను పాఠకులతో పంచుకోవడానికి వ్యాస రచన ఒక ఉత్తమ మార్గం అనే ఎరుక కలిగింది. వ్యాసరచన అంటే చిన్నచూపు లేదుగానీ అది సృజనాత్మక రచనలకు ఆటంకమవుతుంది ఒక్కోసారి. వ్యాసాలు పూర్తిగా సామాజికపరమైనవి అయితే, కథలు, నవలలు (ఇతరుల అభిప్రాయలకు ఆవలగా) నాకోసం వ్రాసుకున్నవిగా, నా లోలోపలి ఆరాటాలకు స్పందనలుగా భావించవచ్చు (కె.ఎన్. మల్లీశ్వరి).

సెషన్-3: కథల నిడివి: నూతన పోకడలు

ప్రధాన వక్త: ప్రత్యూష

వెయ్యి పదాలకు మించని 'ఫ్లాష్ ఫిక్షన్’ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నది. తెలుగు సాహిత్యంలో ఇటువంటి ప్రయోగాలు అనేకం గతంలో జరిగాయి. పుస్తకాన్ని చేతబట్టి చదివే కాలం గణనీయంగా తగ్గిపోయింది; ఫోన్‌లోనే ప్రతీదీ చదువుకొనే రోజులు వచ్చాయి. భారతదేశవాసులు సగటున రోజుకి 7.3 గంటలసేపు ఫోన్లను చూస్తూ గడుపుతారని ఒక అంచనా. ఆఫ్రికాలో అది 10గం.కు పైనే. కొద్దికాలం క్రితం, అమెరికన్ ఫ్లాష్ ఫిక్షన్ 73 కథలతో సంపుటిగా వెలువడింది. 

150 అక్షరాలకు మించని టెరిబ్లీ టైనీ టేల్స్ (TTT) వస్తున్నయి. మనదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వీటికి పెద్ద సంఖ్యలో పాఠక సమూహాలు ఏర్పడ్డాయి. ఉదాహరణలు:

‘ఆమె తన ఆడబిడ్డను గర్భంలోనే విచ్ఛిన్నం చేసింది. పిదప మొగబిడ్డ పుట్టాడు. అదేమి చిత్రమోగాని, వాడు తన తల్లి బట్టల బీరువా ముందే తచ్చాడుతూంటాడు.’

‘నేరస్థుడు జైలుకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆమె మాత్రం నేటికీ శిక్షను అనుభవిస్తున్నది - ప్రతీ రాత్రీ ఏడు తరవాత - రోడ్లమీద సంచరిస్తూ'

గుండెలను పిండే విధంగా కేవలం ఆరు పదాలను వినియోగిస్తూ ఎర్నెస్ట్ హెమింగ్వే వ్రాసినట్లుగా ప్రాచుర్యం పొందిన అతి చిన్న కథ - "For sale: baby shoes, never worn."  జగత్ ప్రసిద్ధి పొందింది: (ఆనంత్ చింతలపల్లి).

ఇవాళ్టి రోజుల్లో రచన నిడివి తగ్గేకొద్దీ రీచ్ పెరుగుతుంది. 30 సెకెండ్ల కన్నా ఎక్కువగా ఉండే వీడియోలను కూడా నేటి తరం చూడడం లేదు. మీంలను చూడ్డానికి మాత్రం లక్షలకొద్దీ ఇష్టపడుతున్నారు. ఎవరికీ టైము లేదు. పాఠకులకు కథలను పరిచయం చెయ్యడానికీ, వారిలో ఆసక్తిని రేకెత్తించడానికీ, ఫ్లాష్ మీడియం ఉపయోగపడుతుంది. ఏదో విధంగా పాఠకులను చేరుకోవడం ముఖ్యం (చిన్ని అజయ్). 

సెషన్-4: రచనా ప్రయాణం

వ్రాయడంకన్నా కూడా చదవడం ముఖ్యం. నేటికీ విస్తారంగా చదివే ప్రయత్నంలో ఉన్నాను. ఇంగ్లీషైనా, తెలుగైనా పాత తరాల రచనలు మళ్లీమళ్లీ చదివింపజేస్తున్నాయి. యువ రచయితలు సరికొత్త అంశాలను ఎన్నుకుంటున్నారు. వాటి ద్వారా మారుతున్న సమాజాన్ని తెలుసుకోగల అవకాశాలు ఏర్పడుతున్నాయి (సుజాత వేల్పూరి).

నేను హఠాత్ రచయితని. ఇకమీదట వాసి మీద దృష్టిపెట్టాలనీ, వ్రాయడం తగ్గించాలనీ అనుకుంటున్నాను. లోతుగా పరిశోధనచేసి, విషయ పరిఙ్ఞానాన్ని పెంచుకొని, నూతనాంశాలపై రచనలు సాగించాలని ఇవాళ్టి నా ప్రయత్నం (ఏ. ఉమామహేశ్వర రావు).

ఉద్యమ ప్రేరణతో గీత రచయితగా మొదలుపెట్టాను. కవిత్వం వ్రాసాను. కథలు వ్రాయడం మొదలుపెట్టాను. ఏ అంశమైనా నన్ను వేధించినప్పుడే, వ్రాయకుండా ఊరుకోలేనప్పుడే ఏదైనా రాస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయుడిని. ఏ పల్లెలో ఎవరిని కదిలించిన కథలే కాదు, నవలలు పుట్టుకొస్తాయనేది నా అనుభవం (గాజోజు నాగభూషణం).

సెషన్-5: ఎక్కువ నిడివిగల వచన రచనలు

నేను వ్రాసినవన్నీ నాలోని బరువు దించుకొనే ప్రయత్నాలే; స్వీయానుభవాలే, ఆత్మ కథనాలే. అందుకని నిడివిని ఎన్నడూ పట్టించుకోలేదు. ఈ మార్గంలో నడిచినప్పుడు, నవలలు వ్రాయడం సంభవించింది. ఇక మీదట నా స్వంత అనుభవాలపై కాకుండా, కాల్పనిక సాహిత్య రచనపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. నన్ను బాగా అలరించేది నవలా రచనకై చేసే పరిశోధన. అది నన్ను ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది (ప్రసాద్ సూరి).

ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డిగారితో పరిచయం, తెలుగు మహాసభలు నా రచనలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని కల్పించాయి. 'బంగారం' అని మేము పిల్చుకొనే బర్రెను ప్రధానపాత్రగా నవలను వ్రాశాను. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ స్ఫూర్తితో 'పొత్తి' అనే ప్రతీతాత్మక నవలను వ్రాశాను. నా వచనంలో కవిత్వం ఎక్కువగా ధ్వనిస్తుందని అంటారు (నర్రా ప్రవీణ్ రెడ్డి).

నేను వ్రాసుకున్న ఆత్మకథ నేటికి సుదీర్ఘ రచన. అది వ్రాయడం పూర్తయ్యాక, నేనూ నాభార్యా కంటతడిపెట్టుకున్నాం. అలాగని ఆగిపోలేదు. ఐదు కథలు, కవిత్వం వ్రాశాను (చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ).

సెషన్-6: తెలుగు కథల ఇంగ్లీషు అనువాదం

తెలుగు కథలు, నవలలు, కవిత్వం ఇతర భాషలలోకి, ముఖ్యంగా ఇంగ్లీషులోకి పెద్ద ఎత్తున అనువాదం కావాల్సిన అవసరం ఉంది. అనువాదానికి పూనుకొనే ముందుగానే స్పష్టత ఉండాల్సిన ప్రశ్నలు:: 1)  పాఠకులెవరు? (తెలుగు చదవలేని తెలుగు వాళ్లా? ఇతర రాష్ట్రాల భారతీయులా? ఎన్నారైలా? అంతర్జాతీయ పాఠకులా? పైన చెప్పిన వాళ్లందరూనా?) 2) ఎవరి భాష? ఎప్పటి భాష? 3) వివరణలు ఇవ్వాలా, వద్దా? (బ్రాకెట్లు వాడాలా? ఇటాలిక్స్ వాడాలా? ఫుట్‌నోట్స్ అవసరమా?) 4) మాండలీకాల్ని అనువదించడం ఎట్లా? 5) అనువాదం ఎట్లా ఉండాలి? (భావ ప్రధానమా, పాఠ్య ప్రధానమా?)

అనువాదం పాఠ్యప్రధానం కాదు, భావప్రధానం. నాలుగైదు స్థాయిలలో మెరుగులు దిద్దుతూ ముందుకిపోయే సమిష్టి కృషి, పునః సృష్టి (ఉణుదుర్తి సుధాకర్).

రచయితకు, అనువాదకులకు మధ్య రచన పరంగా ఉండాల్సిన బలమైన బంధం, పరస్పర సహకారం అనువాద నాణ్యతను నిర్దేశిస్తాయి. తెలుగు నుండి ఆంగ్ల అనువాదం లో ఎదురయ్యే సమస్యలు ఒక ఎత్తయితే, ఆ అనువాద రచనలకు మార్కెట్లను వెతుక్కోవడం, పరాయి ప్రాంతాల/దేశాల పాఠకుల్ని  చేరుకోవడం మరో ఎత్తు (శృంగవరపు రచన).




సెప్టెంబరు 23-24 తేదీలలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, దిగిడి గ్రామం, జహీరాబాద్‌ సమీపంలో జరిగిన

కథా ఉత్సవం-2023: కొన్ని విశేషాలు సంక్షిప్తంగా - ఉణుదుర్తి సుధాకర్

రెండవ రోజు-2

సెషన్-10: కథల్లో మాండలీకాల ప్రయోగం

మొదట్లో ఎన్నో సందేహాలుండేవి. ఏమేరకు మాందలికాలను వినియోగించవచ్చు? అవి అందరికీ అర్థం అవుతాయా?...కొన్ని కథలు ప్రచురితమైనాక, పాఠకుల స్పందనలను చూశాక, ఆ ఆ సందేహాలు తొలగి పోయాయి (ఊహ).

నా కథల్లో ఉర్దూ మాటలను విరివిగా వినియోగిస్తాను. వివరణలు ఇస్తాను. పాఠకులకు ఇబ్బంది లేదు (హుమయూన్).

నా భాషలో అయితేనే స్పష్టంగా, ధైర్యంగా చెప్పగలను. మాండలికాలమీద ఇంత తర్జనభర్జన అనవసరం. మా మాండలికాలు పూర్తిగా తెలియాలంటే వచ్చి మా ప్రాంతాల్లో కొన్నాళ్లపాటు ఉండండి. ఏ కథలో అయినా అన్న్నీ రాస్తారా? ఎంత వరకూ అవసరమో అంతే రాస్తారు. ఆత్మ కథలోనైనా అన్నీ రాసేస్తారా? మొత్తం అంతా రాసేస్తే రాసినవాళ్లే చదువుకోలేరు. చదివినా బతకలేరు (ఎండ్లపల్లి భారతి).

మాండలికాలనుండి అన్ని ప్రాంతాలవారికీ అర్థం కాగల భాష వైపుగా ప్రయాణిస్తున్నాను. వీలైనంతమంది పాఠకులను చేరుకోవడం నా ధ్యేయం (రూబీనా). 

ఒక రచనలో మాండలికాల ప్రయోగం ఏ మేరకు అవసరం అనేది రచయిత గుర్తించాలి. పాఠకుడిగా ఇతర మాండలికాలను అర్థంచేసుకొనేందుకు గట్టి ప్రయత్నం చెయ్యాలి (సాయి వంశి).

సెషన్-11: కథ, సినీమా

‘రూఫస్‌గాడి సైకిల్’ ఒక నోస్టాల్జియా కథ. ఆ తరువాత కథలను లఘుచిత్రాలుగా నిర్మించడం మొదలుపెట్టాను. ఎంచేతనో గాని ముక్కూ మొహం తెలియని వాళ్లు నా దగ్గరకు వచ్చి తమ కష్టాలను ఏకరువుపెట్టి వెళ్లిపోతారు. నాకు ఆ విధంగా చాలా విషయాలు, జీవితాలు తెలిసాయి. చాలా మంది రచయితలకు దృశ్యమానంగా, నాటకీయంగా, సంభాషణా ప్రధానంగా వ్రాసే అలవాటులేదు. కథను తెరపైక్ ఎక్కించేటప్పుడు కథాసారం జారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మొదట రచయితని ‘చంపెయ్యాలి’. కథాసారాన్ని మాత్రం తీసుకోవాలి (దినేష్).

రైటర్స్ మీట్ సృష్టించిన రచయితనని గర్వంగా చెప్పుకుంటాను.  ఖదీర్ బాబు ప్రోద్బలంతో వ్రాసిన 'చున్నీ’ నా తొలి కథ. స్టాండ్-అప్ కమేడియన్‌గా మొదలుపెట్టి, సినీమా కథ వ్రాయలనుకున్నప్పుడు రొమాంటిక్ కామెడీ కావాలన్నారు. ‘పలాస’ తరువాత దర్శకుడిగా నిలదొక్కుకున్నాను. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినీమాని డైరెక్ట్ చెయ్యడం మంచి అనుభవం. ఇప్పుడు 'మట్కా’ అనే సినీమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఈ క్రమంలో సినీమా కోసం రాసే విధానం పట్టుబడింది (కరుణకుమార్).

సెషన్-12: నా అనుభవాలు, ఙ్ఞాపకాలు: బి. నరసింగరావు, ప్రముఖ సినీ దర్శకుడు 

జీవితానికి దూరంగా ఉంటూ రచనలు చేస్తాం; అట్లా కాకుండా జీవితంతో నిత్యం సంఘర్షిస్తూన్న వాళ్లతో, ముఖ్యంగా గ్రామీణులతో మమేకం అవుతూ వ్రాస్తే గొప్ప ఇతివృత్తాలు లభ్యమవుతాయి; వాటిల్లోంచి మంచి కథలు పుడతాయి.

నేను జానపదగీతాల సేకరణకై తెలంగాణా మారుమూల ప్రాంతాలు తిరిగాను. ‘ఎన్నిపాటలు పాడతావు?’ అని అడిగినప్పుడు ఒకామె,'కడుపులో ఉన్న పాటలన్నీ పాడతాను’ అని సమాధానం ఇచ్చింది.

రికార్డు చేసేందుకు టేప్ రికార్డర్లు, కేసెట్లు ఉండేవి; వాటికి కాలపరిమితి ఉంటుంది.  మన జానపద గాయకులకు, వారి పాటలకు నిర్ణీత నిడివి అంటూ లేదు. కాలపరిమితి వారికి అసహజం.

'వానదేముడు పాట పాడతాం’ అంటూ కొందరు మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ‘ఎంతసేపు ఉంటుందీ పాట?’ అని అడిగినప్పుడు, ‘ఎంతసేపైనా పాడతాం’ అన్నారు. నాకు అర్థం కాలేదు.

‘పాట మొత్తం పాడడానికి ఎంతసేపు పడుతుంది?’ అని మళ్లీ అడిగాను. ‘పదిరోజులు’ అని సమాధానం వచ్చింది.

‘నా కేసెట్లో నలభై నిమిషాల పాట పడుతుంది’ అంటే, ‘అయితే అలాగే, నలభై నిమిషాలే పాడతాం’ అన్నారు.

తేలికగా ఉండేమాటల్లోనే మన గ్రామీణులు లోతైన అర్థాన్ని నింపగలరు. ఒకసారి ఒకామె నాతో ఇట్లా అన్నది: 'భూమికి తృప్తిలేనట్లే, ఆడదానికి కూడా తృప్తి అనేది ఉండదు.’ ఈ మాటలు నా లోలోపల నాటుకున్నాయి; ఒక సినీమాలో వాటిని వినియోగించాను.

మన గ్రామీణులలో క్షమాగుణం మెండుగా ఉంటుంది; ముఖ్యంగా స్త్రీలలో. భార్యా భర్తలు ఎంత వాదులాడుకున్నా విడిపోవడం అరుదు. 

నా చుట్టూ ఉన్న జీవితాన్ని ఎన్నో ఏళ్లు పరిశీలించాక కొన్ని విషయాలు తెలుసుకున్నాను. స్వార్థం అనేది మనుషుల సహజగుణం. వ్యవస్థ ఏదైనప్పటికీ స్వార్థం కొనసాగుతుంది. అట్లాగే, మానవ జీవితం ఏ సిద్ధాంతానికీ లొంగదు.



సెప్టెంబరు 23-24 తేదీలలో దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, దిగిడి గ్రామం, జహీరాబాద్‌ సమీపంలో జరిగిన

కథా ఉత్సవం-2023: కొన్ని విశేషాలు సంక్షిప్తంగా - ఉణుదుర్తి సుధాకర్

రెండవ రోజు-1

సెషన్-7: అంతర్జాల మాయాజాలం

వక్త: సుధీర్ కస్ప

రూ.2,000/- కోట్ల టర్నోవర్‌తో, 60 ఎపిసోడ్‌ల నవలల పోటీలతో 'ముందుకి’ సాగిపోతూన్న 'ప్రతిలిపి’ని ఉదహరిస్తూ, అంతర్జాల మాధ్యమం సాధిస్తూన్న విజయాలను హైలైట్ చేశారు వక్త. ఒక వైపు 'ప్రతిలిపి వంటి సంస్థలు లక్షల సంఖ్యలో స్పందనలను పోగుచేసుకుంటూంటే, మరో వైపు. 'సీరియస్’ రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు కరువై కొట్టుమిట్టాడుతున్నారు. ఇన్నాళ్లూ రాశిపై దృష్టిని పెట్టిన ఈ అంతర్జాల సంస్థలు ఇప్పుడు వాసికై ప్రయత్నిస్తున్నాయి. ఇది రచయితలకు ఒక అవకాశం. హెచ్చరిక: అలాగని మెదడు బొత్తిగా అవసరంలేని తేలికపాటి కథలు, లేదా బూతు కథలు వ్రాయమని కాదు.

సెషన్-8: మణిపూర్ పరిణామాలు

వక్త: డానీ (ఇటీవల మణిపూర్‌లో జరుగుతూన్న ఘర్షణలను స్వయంగా పరిశీలించేందుకు, బేరీజువేసేందుకు ఆ ప్రాంతాల్లో పర్యటించారు)

మణిపూర్ పరిణామాలు రెండు జాతుల మధ్య మొదలైన సంఘర్షణలు మాత్రమే కాదు. అవి పైకి కనిపించేవాటికన్నా సంక్లిష్టమైనవి; జాతీయ, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల మాఫియా ప్రలోభాలకూ, రాజకీయ శక్తుల ఆధిపత్య పెనుగులాటకూ సంబంధించినవి. స్థానిక తెగలు, ఈ బాహ్య శక్తుల చదరంగపుటెత్తులలో పావులు మాత్రమే. థాయ్‌లాండ్, కాంబోడియా, లావోస్ దేశాలపై పట్టును ఏర్పరచుకున్న అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ఈ సంఘర్షణల వెనుక ఉన్నది. మరోవైపు, కొండ ప్రాంతాలలోకి మైదానప్రాంతవాసులు జొరబడకుండా కట్టడిచేసే చట్టాలను నిర్వీర్యంచేసే ప్రయత్నాలను నేటి కేంద్ర ప్రభుత్వం చేబట్టింది. రాబోయే రోజుల్లో ఈ సవరింపును దేశమంతటికీ వర్తింపజేయడం ద్వారా, గిరిజనులకు హానికరంగానూ, పెట్టుబడికి సౌకర్యవంతంగానూ మార్చే పథకాలు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నవి.


సెషన్-9: సాహిత్యంలో వాస్తవిక వాదం, వాస్తవికేతర వాదాలు

వక్త: అనంతు చింతలపల్లి

14-15వ శతాబ్దాలలో ఐరోపాలో సంభవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రధానంగా చిత్రకళని క్రైస్తవ మతపరమైన అంశాలనుండి లౌకిక, ప్రాపంచిక, సామాజిక అంశాలవైపుగా మళ్లించింది. ఆనాటి విఙ్ఞాన వికాసం సముద్రయానాలకూ, వలసరాజ్యాల ఆక్రమణకూ, ఐరోపా దేశాల్లో సంపద పోగుపడడానికీ తెరతీసింది. అలాగే 1760-1840లనాటి పారిశ్రామిక విప్లవం అంతర్జాతీయ ఆర్థిక సామాజిక పరిణామాలనూ, వివిధ కళారంగాలనూ విశేషంగా ప్రభావితం చేసింది. ఛార్లెస్ డికెన్స్ వంటి రచయితల ఆధ్వర్యంలో నవలా ప్రక్రియ ప్రాణంపోసుకుంది. ఆధునికతకి బీజం పడింది. మత ప్రభావానికి దూరంగా - నిరీశ్వరవాదపు, హేతువాదపు,  కొనసాగింపుగా వాస్తవికవాదం ముందుకొచ్చింది.

ఫ్రెంచి రియలిజం (c.1840-1900) ‘చూపించేదే అంతరార్థం కానక్ఖర్లేదు’ అంటుంది. ఫ్రెంచి వాస్తవికవాదులు ఎమిల్ జోలా, బాల్జాక్,  గుస్టావ్ ఫ్లౌబెల సహజవాద సాహిత్యంలో అత్యంత సాధారణ వ్యక్తుల, కష్టజీవుల రోజువారీ శ్రమనీ, ప్రయాసల్నీ వివరంగా నమోదు చేశారు. అదేకాలంలో (1848) ప్రచురించబడిన కార్ల్ మార్క్స్, ఏంగెల్సుల కమ్యూనిస్ట్ మానిఫెస్టో వెలువడింది. కార్మికవర్గం వైపున నిలబడ్డ మార్క్సు, ఏంగెల్సులు సామాజిక గతిసూత్రాలను పునర్ నిర్వచించారు. సోషలిస్టు, మార్క్సిస్టు కళాకారులు, సాహిత్యకారులు వాస్తవికతకు పెద్ద పీట వేశారు.

శ్రామికవర్గానికి ఉన్నత కళా, సాహిత్య రంగాలలోకి ఎదిగేందుకుగాను వెసులుబాట్లు కల్పించాలనీ, అందుకు దోహదపడాలనీ ఫ్రెంచి మేధావులు, వాస్తవికతావాదులు కొందరు ఆరాట పడ్డారు. ఇందుకు భిన్నంగా, అదే కాలంలో, కార్మికవర్గం తన చరిత్రనూ, కళలనూ తానే నిర్మించుకుంటుందని మార్క్సు, ఏంగెల్సులు తమ కమ్యూనిస్టు ప్రణాళికలో ఉద్ఘాటించారు. మేనిఫెస్టో ప్రకటన, దాని ధిక్కారస్వరం ఫ్రెంచి మేధావులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

1917నాటి సోవియట్ యూనియన్ ఆవిర్భావంతో వాస్తవికవాదం బలోపేతం అయింది. సోషలిస్టు రియలిజం - చారిత్రక నిర్దిష్టతనూ,  శాస్త్రబద్ధతనూ ఏర్పరచుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

వాస్తవికత, వాస్తవికేతరత

ఉదాహరణకి మీ కథా ఇతివృత్తం ‘కుక్క’ అయితే అందులో వాస్తవికత ఎంత? వాస్తవికేతరత ఎంత? బేరీజు వెయ్యడానికి ఈ క్రింది ప్రశ్నలను గమనించండి.

• మీరెప్పుడైనా కుక్కని చూశారా? చూస్తే గనక అది దృగ్విషయం (Phenomenal), స్వానుభవం (Empirical)

• మీకు కుక్క తెలుసా? తెలిసిఉంటే అది కుక్క పట్ల ఎరుక (Epistemological)

• మీకు కుక్కల్లో ఉండే రకాలు వాటి జాతులు తెలుసా? తెలిసి ఉంటే అది కుక్కల వర్గీకరణ (Ontological)

• కుక్క కరుస్తుందని మీకు తెలుసా? కరిస్తే ఏం చెయ్యాలో మీకు తెలుసా? తెలిసి ఉంటే మీరొక శాస్త్రీయ ప్రతినిధి (Professional)

• మీకు కుక్కలంటే ఏవేవో భయాలు, చీదర, ఎలర్జీలు ఉన్నాయా? ఉంటేగనక మీ రచనలో మనోవైఙ్ఞానికశాస్త్ర (Psychological) ప్రమేయం అవసరం కావచ్చు.

• కుక్కల మూలంగా పర్యావరణంపై దుష్ఫలితాలు ఉండవచ్చని అనుకుంటున్నారా? అయితే పర్యావరణ చైతన్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మీకు పై అంశాల పట్ల పరిపూర్ణమైన అవగాహన, అంగీకారం ఉన్నట్లయితే మీరు కుక్క రచనకు పూనుకోవచ్చు. లేదా మీ కుక్క రచన వాస్తవికతకు దూరంగా ఉండిపోయే ప్రమాదం ఉంది.

వాస్తవికవాదానికీ, వాస్తవికేతరవాదాలకూ మధ్యేమార్గంగా అమూర్తత(Abstraction)ను గుర్తించడం జరుగుతోంది. అమూర్తత అనేది, నిర్దిష్టత(Concrete)కు వ్యతిరేకం. ఇప్పుడు కుక్క ఉదాహరణతోనే అమూర్తతను అర్థం చేసుకుందాం.

ఒక పిల్లవాడిని కుక్క బొమ్మను గీయమని అడగండి. అతడు వెంటనే ఒక బొమ్మని గీస్తాడు. దానికి తల, కళ్లు, చెవులు, శరీరం, తోక, కాళ్లూ అన్నీ ఉంటాయి. కానీ అది అతడి కుక్క. అటువంటి కుక్క ఎక్కడా ఉండబోదు. ఎందుకంటే ఏ జాతికీ చెందినది కాదు; దానికి నిర్దిష్టతలేదు. అందుకే అది ఫలానా కుక్క కాదు. అది ఆ పిల్లవాడి ఊహ మాత్రమే. (త్రిపుర ‘భగవంతం కోసం’ కథలో నిర్దిష్టమైన కాఫీ, ‘వేడి రంగు గోధుమ ఊహ’గా, అమూర్తంగా మారిపోవడం మనం చూశాం).

భారతదేశంలో కనిపించే వీధి కుక్కల జాతుల వివరాలు నమోదు చెయ్యబడ్డాయా?  వివరాల పట్ల మనకు వున్న నిర్లక్ష్యం ఏమో? కుక్క మీ గురించి ఏమనుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? చివరిగా, మీరే గనక ఒక కుక్క అయితే...ఇవేవీ తెలియకుండా, తెలుసుకోకుండా మీరు కుక్క కథ వ్రాసేస్తే అది నిర్దిష్టమైన కుక్క కాజాలదు. అది మీ ఊహ మాత్రమే. అది వాస్తవికత అవుతుందా?

ఇప్పుడు కుక్క అనే పదానికి బదులు, స్వర్గం అనే మాట వాడదాం. స్వర్గం ఉంటుందనీ, ఫలానా విధంగా ఉంటుందనీ చాలా మంది నమ్ముతారుగానీ చూసినవారులేరు. (కుక్కనైతే కనీసం అందరం చూశాం). పోనీ కుక్కకి బదులు కాటికాపరి అనే పదం వాడామే అనుకోండి. ఎవరీ కాటికాపరి? అతనికీ నిర్దిష్టత లేదు...అలాగే హిజ్రా, సమాధులకోసం గోతులు త్రవ్వేవాడు, బిచ్చగాడు...ఎవరు వీరంతా?? మీ ఊహలలో, నిర్దిష్టతలకు ఎడంగా, అమూర్తంగా ఉండిపోయే వీరితో కథ వ్రాస్తే అది వాస్తవికత అవుతుందా?

బహుశా వాస్తవికేతర గందరగోళం నుండి దూరంగా తొలగేందుకై సోవియట్ కమ్యూనిస్టు పార్టీ, మాక్సిం గోర్కీని సామ్యవాద వాస్తవికతపై ఒక సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించమని అడిగినప్పుడు అతడు ఆ బృహత్ కార్యానికి తాను తగనని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు. అయితే సోషలిస్టు రియలిజంకు మూల స్తంభాలుగా నిలిచే నాలుగు సూత్రాలను ప్రతిపాదించాడు:

1) ఏ రచనైనా, కళారూపమైనా కార్మికవర్గం (ప్రోలెటేరియట్)కి దన్నుగానే నిలబడాలి.

2) కళారంగ ఉత్పత్తులు అట్టడుగు వర్గాల జీవితాలను ప్రతిబింబిస్తూ, అనుభవాలను నమోదుచేస్తూ, వారికి అర్థం అయ్యేటట్టుగా ఉండాలి.

3) రచయితలూ, కళాకారులూ ఎంచుకొనే ఇతివృత్తాలు సామాజిక మార్పులను ప్రతిబింబించాలి.

4) కళారంగ లక్ష్యాలు కార్మిక రాజ్యపు లక్ష్యాల పరిధిలోనే ఉండాలి.

తెలుగు సాహిత్యానికి వస్తే, కొద్ది మినహాయింపులలో - (ఉదా. శ్రీశ్రీ ప్రయోగాలు కొన్ని, బుచ్చిబాబు, త్రిపుర) మన రచనల్లో సుమారు 90 శాతం వాస్తవికవాద రచనలే. ఈ పరిణామాన్ని ఆధునికత వైపుగా సమాజం చేస్తూన్న ప్రయాణంగానూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చెలరేగిన ప్రజాపోరాటాల, రాజకీయ సాహిత్యోద్యమాల ఫలితం అని భావించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగానూ, అలాగే మన సాహిత్యానికీ ఎంతో మంచిని చేసిన వాస్తవికవాదం, కొంత చెరుపుని కూడా చేసింది. మన పౌరాణిక, జానపద, గ్రామీణ మూలాల్లోని వాస్తవికేతర ధోరణులను విస్మరించి వాటినే చుట్టూ తిరిగి పాశ్చాత్య, లాటిన్ అమెరికన్ రచనలద్వారా కొత్తగా తెలుసుకుంటున్నాం, గుర్తిస్తున్నాం (ఉదా. మేజికల్ రియలిజం). వాస్తవికవాదాన్ని కళారంగాలకు అన్వయించడం అంటే కొన్ని పార్టీల రాజకీయ అజెండాకు లోబడి ఉండాలనుకొనే సంకుచిత్వాన్నీ, ప్రమాదాన్నీ ఎదుర్కొంటున్నాం.

ఏది ఏమైనప్పటికీ ఈ ధోరణులపై మరింత విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది.

చివరిగా సోషలిస్టు వాస్తవికత గురించి ప్రస్తావిస్తూ బాలగోపాల్ అన్న మాటల్ని గుర్తుచేసుకుందాం:


“సోషలిస్టు వాస్తవికత' అనే తొలినాటి సోవియట్ సాహిత్య సిద్ధాంతం, ఈ రోజు పెద్దగా ప్రచారంలో లేదు గానీ అది అలవరచిన ఈ వైఖరి తెలుగులో అభ్యుదయ సాహిత్యాన్నేకాక మొత్తంగా తెలుగు కథా సాహిత్యాన్ని (కొద్ది మినహాయింపులతో) ఇంకా వదిలి పెట్టినట్టు లేదు. తెలుగులో కథా సాహిత్య శిల్పం మొత్తం మీద ఇంకా 'రియలిజం' పరిధులు దాటిపోలేదు. నిజ జీవితంలో లాగ తెలుగు కథా సాహిత్యంలో కూడ కాలం ఎప్పుడూ గతం నుండి భవిష్యత్తు వైపే ప్రవహిస్తుంది. కార్యకారణ సంబంధాలు కర్త కర్మ క్రియలలాగ ఉండవలసిన చోటే ఉంటాయి. చైతన్యాన్ని ఎప్పుడూ పదార్థమే నిర్ణయిస్తుంది. 'శాస్త్రీయ దృక్పథం' పాటించాలన్న నియమం లేని పిల్లల సాహిత్యానికి మాత్రమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్నీ హేతువాద తర్కాన్నీ తిరస్కరించే లైసెన్స్ ఇవ్వబడింది.”

(బుర్ర రాములు రాసిన 'ఏడో సారా కథ'కు  బాలగోపాల్ ముందుమాట, పర్స్పెక్టివ్ ప్రచురణ, జులై 1995)

No comments:

Post a Comment