Wednesday, June 5, 2019

సరికొత్త సైద్ధాంతిక భావనకు పుస్తకరూపం

సరికొత్త సైద్ధాంతిక భావనకు పుస్తకరూపం

సమాజమనే బంధం నుంచి కట్టుబాట్లను ఛేదించుకొని స్వార్థ సంకుచిత జీవితాన్నే పరమలక్ష్యంగా ఎగబాకుతున్న వారికి తాము పోతున్నది పైకి కాదు, కిందికి అని తెలిసినా, దానిని సరిదిద్దుకొనే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. కులవృత్తుల నుంచి కుటీర పరిశమ్రలకు, వాటి నుంచి పొగగొట్టాలకు, అక్కడ్నించి ఐటి పరిశ్రమలకు ఎగబాకిన మానవ ప్రగతిరథం చివరకు చేరుకున్నది ఎక్కడికో తెలిస్తే మనసు ఉసూరుమంటుంది. ఇంగ్లండు, అమెరికా సమాజాల పోకడలను అతిగుడ్డిగా అనుకరిస్తున్న భారత్ సహా అనేక ప్రపంచ దేశాల్లోని సమాజాల పరిస్థితి ఇవాళ మీద మిటమిట- లోన లొటలొట అన్నట్టుగానే ఉంది.

druvanikataప్రసిద్ధ సాహితీవేత్త డా॥ పాపినేని శివశంకర్ కలం నుంచి తాజాగా వెలువడిన విలువైన గ్రంథం ద్రవాధునికత చదివిన వారికి ఎవరికైనా సరిగ్గా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. అత్యాధునిక పోకడల పుణ్యమా అని మనుషులు ద్రవ్యం (డబ్బు) మత్తుకు ఎంతగా బానిసలైనారో, ఆ మడుగు స్థాపనకు మూలధ్రువంలా ద్రవాధునికత అనే మాయాభావన ఎలా దోహదపడుతున్నదీ ఆయన ఇందులో చాలా లోతుగా చర్చించారు.

పోలండ్‌కు చెందిన ప్రఖ్యాత సామాజిక తత్వవేత్త జిగ్మంట్ బౌమన్ (85) సృష్టించిన సరికొత్త సైద్ధాంతిక భావనతో కూడిన పుస్తకం లిక్విడ్ మోడర్నిటీలోని ఆత్మను పాపినేని వారు ఎంతో ఒడుపుగా పట్టి, అంతే సరళంగా తెలుగు పాఠకులకు అందించారు. రెండేళ్లుగా చదువుతూ వచ్చిన బౌమన్ పుస్తక సారాన్ని మనవైన, స్థానిక పట్టువిడుపులతో మేళవించి, తనదైన సారాన్ని జోడించి ప్రస్తుత తెలుగు సమాజానికి సరిపోయేలా అక్షరబద్దం చేశారు. అసలు, ద్రవాధునికత అంటే ఏమిటి అంటే ఒక్క మాటలో ఉరకలేసే వర్తమానం అన్న బౌమన్ మాటను ఉదహరించారు. అంతేకాదు, ఆఖరకు అదొక గాడితప్పిన జీవన విధానం.

దానికి వారు పెట్టిన ముద్దుపేరు స్వేచ్ఛ అన్నారు. నిజమే, స్వేచ్ఛ ఇవాళ ఎంత విశృంఖల జీవనమైందో ఈ పుస్తకం చదివితే పూర్తిగా అర్థమవుతుంది. బౌమన్ వెలువరించిన భావాలే (మొదటి భాగం) ఒక ఎత్తు అనుకుంటే, పాపినేని వారు చేసిన విశ్లేషణాత్మక సూత్రీకరణలు (రెండో భాగం) మరో ఎత్తు అనాలి. అవసరమైనప్పుడు బౌమన్‌తో విభేదించినట్లు, మనదైన సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడక్కడ ఒకింత పక్కకు కూడా జరిగినట్లు వారు ముందుమాట (సరికొత్త ఉరవడిలో..)లో చెప్పారు. సాహిత్యంలోని ఈ పదునైన పనిముట్టును సామాజిక చైతన్యవంతులు మున్ముందు ఇంకా వైనంగా చర్చించాలని కూడా వారు అభిలషించారు. ఇది చాలు, పాపినేని వారు పుస్తకాన్ని వీలైనంత వరకు ఎంత సమగ్రంగా, సముచితంగా రాశారో చెప్పడానికి.

అవును, రెక్కలొస్తే మనిషి ఎక్కడికైనా ఎగిరిపోయి, ఏదైనా చేస్తాడన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం దుర్వినియోగమవుతున్న స్వేచ్ఛ. పదిమంది సామరస్యత, సమగ్రతల కోసం ఏర్పరచుకొన్న నియమాలు, చట్టాలు, న్యాయాలు, ధర్మాలు అన్నీ అలాంటి వారికి అడ్డుపుల్లలుగానే కనబడుతుంటై. మూస అభివృద్ధి పరిణామ క్రమంలో మానవజాతి అమానవీయంగా తయారవుతున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి తాత్విక చర్చలు అనివార్యం, అత్యవసరం కూడా.

ఒక ద్రవ పదార్థంలా స్థిరంగా ఉండక నిరంతరం మార్పులు చెందుతున్న సామాజిక స్థితిగతులనే బౌమన్ ద్రవాధునికత భావనగా పిలిచారు. దీనిని భారరహిత పెట్టుబడి కాలం (పే: 24)గానూ ఆయన పేర్కొన్నారు. ప్రగతి గత కొన్నేళ్లుగా ఎంతగా వ్యక్తిగతమైందో, విధాన రహితమైందో వివరించారు. శ్రామిక శక్తి మృదువుగా మారింది. భౌతిక వస్తువులు కాక ఐడియాలు కూడా లాభాలకు కేంద్రబిందువులవుతున్నాయి. పెళ్లిని కాదని, సహజీవనానికి అలవాటు పడడం దగ్గర్నుంచీ అభివృద్ధి పేరుతో విధ్వంసమై పోతున్న విలువలన్నీ ఇందులో చర్చకు వచ్చాయి. పుస్తకంలో మొత్తం 32 వ్యాసాలు ఉన్నాయి.

ద్రవాధునికం పేరున ఒక కవిత అందించారు. బౌమన్ జీవిత విశేషాలు, ఆయన రచనల వివరాలు పాఠకులకు ఉపయుక్తం. ఆధునిక జీవితం ఎటు తిరిగి ఏ గతి పట్టింది, ఘనాధునికత తర్వాత ద్రవాధునికత పుణ్యమా అని విస్తరించిన అపసవ్య ధోరణులు, వాటి నుండి బయటపడే మార్గాలనూ రచయిత చాలా విపులంగా చర్చించారు.
ద్రవాధునికత, రచన: డా॥ పాపినేని శివశంకర్, పేజీలు: 104, వెల: రూ. 70/- ప్రతులకు: నవచేతన బుక్ హౌస్ అన్ని పుస్తక కేంద్రాలు లేదా నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ (నాగోల్), జిఎస్‌ఐ (పోస్ట్), హైదరాబాద్-500068. ఫో॥ 040-24224458. రచయిత మొబైల్: 85008 84400.

దోర్బల

అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత - డా.పాపినేని శివశంకర్

Sunday, 21 July 2013
అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత - డా.పాపినేని శివశంకర్
అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత - డా.పాపినేని శివశంకర్
July 22, 2013
ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ ఉంది. ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమం కూడా కన్పిస్తుంది...
 మీరు చూసే ఉంటారు. రోడ్డు మీద అపరిమిత జనసందోహం మధ్య ద్విచక్రవాహనం మీద పాతికేళ్ల కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసు పని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా గురించి ముచ్చటిస్తున్నాడా అనేది మన కనవసరం. సదరు ద్విచక్ర వాహన చోదకుడి పరిస్థితిలో చలనవేగం ఉంది. అందువల్ల అస్థిరత ఉంది. అందువల్ల అభద్రత కూడా ఉంది. ద్రవాధునికత (Liquid Modernity) అనే భావనని అర్థం చేసుకోవటానికి ఆ దృశ్యం చక్కని ఉదాహరణ.

ఇప్పటిదాక తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, అసలు సంగతి దాన్ని మార్చటమే నన్నాడు చాన్నాళ్ల కిందట కార్ల్ మార్క్స్. అయితే కర్త ఎవరో కనపడకుండా విపరీత వేగంతో మారుతున్న ప్రపంచ వ్యవస్థల మధ్య మనమిప్పుడు అవస్థలు పడుతున్నాం. పల్లెల నుంచి పరదేశాల దాక వలసలు, భూసంబంధాల్లో విస్థాపనలు (displacements), మూలాల విచ్ఛిన్నత, రంగులు మారే వస్తు ప్రపంచం, మార్కెట్ సంక్షోభాలు, ఉద్యోగ జీవితాల్లో అభద్రత, ఆధునిక మానవుడి మానసిక గ్లాని -ఇవన్నీ మనల్ని కలవరపెడుతున్నాయి. ఈ అస్థిర వర్తమానాన్ని కొత్తగా అర్థం చేసుకోవటానికి, విశ్లేషించి వ్యాఖ్యానించటానికి జిగ్మంట్ బౌమన్ Zygmunt Bauman) రాసిన 'లిక్విడ్ మోడర్నిటీ' (Liquid Modernity) అనే పుస్తకం ఉపయోగపడుతుంది. ఆ విధంగా మార్పుకి దోహదం చేస్తుంది.

పోలెండ్‌కి చెందిన ఈ సామాజిక తత్వవేత్త, ఆచార్యుడు పాశ్చాత్య తత్వశాస్త్రంతోపాటు సామాజిక శాస్త్రం బాగా అధ్యయనం చేశాడు. కార్ల్ మార్క్స్, మాక్స్ వెబర్, ఆంటోనియోగ్రాంసీ, డెరిడా మొదలైన వాళ్ల ప్రభావాలకు లోనయ్యాడు. వాటికి కొనసాగింపుగా లిక్విడ్ మోడర్నిటీ, లిక్విడ్ లవ్, వేస్టెడ్ లైవ్స్, లిక్విడ్ లైఫ్ పుస్తకాలు రచించాడు.

ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి బౌమన్ రెండు భావనలు రూపొందించుకొన్నాడు. అవే 1. ఘనాధునికత (Solid Modernity) 2. ద్రవాధునికత (Liquid Modernity). (పోస్ట్ మోడర్నిటీ అనే పదంలోని గందరగోళం తప్పించటానికి బౌమన్ లిక్విడ్, సాలిడ్ అనే పదాలు గ్రహించాడు).

ఘన ద్రవ లక్షణాలు: ఘన పదార్థాల్లోని అణువుల మధ్య గట్టి బంధం ఉంటుంది. అది ఆ అణువులు విడిపోకుండా -పదార్థం సడలిపోకుండా- నిరోధిస్తుంది. ప్రత్యేక నిర్మాణ విధానంవల్ల వాటికి ఒక స్థిరత్వం ఉంటుంది. ఘన పదార్థాలు నిలకడగా ఉంటాయి. కొంత స్థలం ఆక్రమిస్తాయి. స్థలమే ప్రధానం, కాలం వాటికి ముఖ్యం కాదు. అంటే చిరకాలం నుంచి అవి అట్లాగే పడి ఉంటాయి. కదలికను లేదా మార్పును ఎదుర్కొనే స్వభావం వాటిల్లో బలంగా ఉంటుంది.

ద్రవ పదార్థాలకు స్థలకాలాల నిర్నిబంధం ఉండదు. అవి తమ ఆకృతిని ఎక్కువకాలం స్థిరంగా నిల్పుకోజాలవు. ఆకృతి మార్పుకు సిద్ధంగా ఉంటాయి. అవి స్థలాన్ని ఎక్కువ (సేపు) ఆక్రమించవు. కాలమే వాటికి ముఖ్యం. ద్రవ పదార్ధాలు తొణుకుతాయి. చిందుతాయి. తేలిగ్గా కదులుతాయి. వేగంగా పరిగెత్తుతాయి. పొర్లుతాయి. ఉప్పొంగుతాయి. ఘనపదార్థాలను ఆపినంత తేలిగ్గా వాటిని ఆపలేం. అవి ఆటంకాల్ని దాటతాయి. కొన్నిటిని తమలో కరిగించుకొంటాయి. కొన్నిటిలోనుంచి ప్రయాణిస్తాయి. అసాధారణమైన ఈ కదిలే గుణం వాటికి తేలికదనాన్నిస్తోంది. ఎల్లప్పుడు కదలికే, అస్థిరతే. వర్తమాన వినూత్న సామాజిక ఘట్టాన్ని ఆకళించుకోవటానికి బౌమన్ ఈ ద్రవత్వం (ఫ్లూయిడిటీ లేదా లిక్విడిటీ) అనే రూపకాన్ని ముఖ్యంగా గ్రహించాడు. ఘన, ద్రవ -ఈ రెండు మాటలకి 'ఆధునికత' అనేది అంటిపెట్టుకొని ఉంది. కనుక ఆధునికతని ముందుగా అర్థం చేసుకొంటే ఆ తర్వాత అందులో వచ్చిన మార్పుని తేలిగ్గా అర్థం చేసుకోగలం.

ఘనాధునికత:
దరిదాపుగా 300 ఏళ్ల నుంచి ఆధునికత (Modernity) ఏర్పడి, కొనసాగిందని బౌమన్ అభిప్రాయం. భౌతికంగా పారిశ్రామిక విప్లవం, భావజాలపరంగా ఫ్రెంచి విప్లవం ఆధునికతకి అంకురార్పణ అనుకోవచ్చు. బిపన్‌చంద్ర కూడ ఈ అభిప్రాయమే వెలిబుచ్చాడు. బౌమన్ ఆలోచనలో స్థలకాల సంబంధంలో మార్పు ఆధునికతకి ప్రారంభ బిందువు. మనిషి జీవనాభ్యాసం నుంచి స్థలకాలాలు విడివడటంతో, అవి పరస్పరం విడివడటంతో ఆధునికత మొదలైంది. అంటే జీవనం ఇంకెంత మాత్రం స్థలకాలాలకు బందీ కాదన్నమాట. అధికారం, ఆధిపత్యం సాధించటానికి త్వరణవేగం ప్రధాన సాధనమైంది. నిబ్బరమైన నడకను తప్పించిన యాంత్రిక ప్రయాణ సాధనాలు నిర్దిష్ట స్థలం నుంచి గొప్ప కదలిక నిచ్చాయి. వేగవంతమైన యాంత్రిక ఉత్పత్తి కాలాన్ని జయించింది; దేశదేశాలకు చేరింది. ఆధునికతకి ఇదొక చిహ్నం.

ఘనాధునికతలో తొలి దశ యిది. ఇందులో కొన్ని కచ్చితమైన నమూనాలున్నాయి. రాజ్యం ఇట్లా ఉంటుంది; వర్తకం ఇట్లా సాగుతుంది; అభివృద్ధి ఈ విధంగా జరగాలి. ఇట్లా కొన్ని నమూనాలు. గత ఉదాహరణల సాయంతో, అనుభవ సంపాదనతో చక్కగా కార్య నిర్వహణ చెయ్యవచ్చని నమ్మిన కాలం అది. గట్టిగా, ఘనాకృతితో అంతగా మారని ప్రపంచంలో ఈ ప్రణాళిక అర్థవంతంగా సాగిందన్నాడు బౌమన్. ఈ దశలో తగినంత సమాచార సేకరణతో, జ్ఞానంతో, సాంకేతిక నైపుణ్యంతో మరింత కచ్చితమైన, హేతుబద్ధమైన ప్రపంచం రూపొందించగలమని మేధావులు భావించారు. 20వ శతాబ్ది తొలి భాగం దాక ఘనాధునికత గురించి, దానిలో రావాల్సిన, రాగల మార్పుల గురించే చర్చించామన్నాడు బౌమన్. ఘనాధునిక దశలో పెట్టుబడిదారు, శ్రామికుల మధ్య, ఇతర వ్యక్తుల మధ్య వైరుధ్యాలతోపాటు దృఢమైన సంబంధాలుండటం గమనించదగింది.

ఈ పరిస్థితిని మన దేశానికి అన్వయించుకుంటే ఇక్కడ వలసవాదుల ద్వారా ఆధునికత ఆలస్యంగా అడుగుపెట్టింది. మేధావులు చాలమందిని ఆధునిక భావజాలం ఆకర్షించింది. అందులో గురజాడ ఒకడు. 'ముత్యాల సరములు'లో ముందు ముందు మేటి వారల మాటలనే మంత్ర మహిమతో జాతి బంధాలు జారిపోతాయని ఆయన అనుకొన్నాడు. 'ఎల్ల లోకము వొక్క యిల్లై, వర్ణ భేదము లెల్ల కల్లై' మనుషుల మధ్య ప్రేమబంధం బలపడుతుందన్నాడు. మతాలన్నీ మాసిపోయి, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందన్నాడు. ఆధునికత ప్రసాదించిన 'జ్ఞానదీపం' స్వర్గలోకాన్ని అంటే ఒక సుఖమయ నూతన ప్రపంచాన్ని- చూపించగలుగుతుందనే నమ్మకం అది.

'కమ్యూనిస్ట్ మేనిఫెస్టో'లో 'melting the solids' అనే మాట ఉంది. దాని అర్థం, ఘనీభవించిన భావజాలం తొలగించి, దాని స్థానంలో సరికొత్తగా అభివృద్ధి చేసిన ఘన-నమూనాలు ప్రతిష్ఠించటమే; మన కాళ్లు చేతులు కట్టిపడేసిన సాంప్రదాయిక విధేయతలు, ఆచారపరమైన హక్కులు తొలగించటమే; అసంబద్ధంగా ఉన్నవాటిని హేతుబద్ధం చెయ్యటమే. ఈ విధంగా ఆధునికతలో రెండోదశ- modernization of modernity-మొదలైందని బౌమన్ గుర్తించాడు. తద్వారా మరింత ఘనీకృత వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇక్కడ బౌమన్ ప్రజాస్వామ్య, సోషలిస్టు వ్యవస్థలు రెండింటినీ ఉద్దేశించి ఉండవచ్చు.

ద్రవాధునికత :
దాదాపు అర్ధ శతాబ్దం నుండి ఆధునికత ఘనస్థితి నుంచి ద్రవస్థితికి చేరినట్టు బౌమన్ నిర్ధారించాడు. మనదేశంలో ఈ క్రమం ఇటీవలే మొదలైంది. ఇది సాఫ్ట్‌వేర్ పెట్టుబడిదారుల శకం. ఇక్కడ పెద్దపెద్ద యంత్రా లు లేవు. స్థలాన్ని జయించటం లేదు. ప్రపంచమంతా తన ఉక్కురెక్కలు సాచిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి సియాటిల్ నగరమే ఏకైక నిలయం. (ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద నుంచి చూస్తే బిల్‌గేట్స్ భవన సముదాయం తప్ప ఫ్యాక్టరీలు, భారీ ఉత్పత్తులు కనపడవు) అంటే పెట్టుబడి కార్ఖానాలు, పెద్ద పెద్ద యంత్రాలు, శారీరక శ్రమ చేసే కార్మికుల్ని వదిలిపెట్టి, కాబిన్ లగేజి వంటి స్వల్ప భారం మోస్తుంది. కనుక ఇప్పుడు పెట్టుబడి ఒక బ్రీఫ్‌కేస్, లాప్‌టాప్, సెల్‌ఫోనులతో ప్రపంచం నలుమూలలకి తేలిగ్గా ప్రయాణించగలదు. ఇది భారరహిత విధానం.

ఈ దశలో పెట్టుబడిదారుకి, ఉద్యోగికి శాశ్వత 'వివాహ బంధం' తెగిపోయి 'కలిసి బతకటం' అనే పద్ధతి వచ్చింది. ఇది తాత్కాలిక సహజీవనం. ఈ బంధం మిక్కిలి బలహీనం. ఎప్పుడైనా పుటుక్కుమనవచ్చు. లేబర్ యూనియన్‌లు లేవు. ఉద్యోగ భద్రత లేదు. అన్ని అస్థిరమైన, కొద్దికాలపు ఉద్యోగాలే. ఇవి రోలింగ్ కాంట్రాక్టులు. ఏ రోజుతో ఉద్యోగానికి మంగళం పాడతారో తెలియదు. కార్పొరేట్ రంగంలో కాంట్రాక్టు లేబర్‌తో పోల్చితే పర్మనెంట్ లేబర్ శతాంశమే.
ద్రవాధునికతలో ద్రవీకృత శ్రామిక విపణిని (fluid labour market) గుర్తించాడు బౌమన్. సాఫ్ట్‌వేర్ తరంలో శ్రామిక వర్గం సడలిపోయిందని, అందువల్ల పెట్టుబడి భారరహితంగా మారిందని, అందువల్ల తేలిగ్గా, వేగంగా కదలగలిగిందని వివరించాడు బౌమన్. తేలికదనం, వేగం వల్ల కలిగే సమస్యలు వేరు. ఈ భారరహిత పెట్టుబడి విధానం విమానయానం వంటిది. పైలట్ క్యాబిన్ ఖాళీగా ఉంటుంది! ప్రయాణికులకు విమానం ఎటు పోతుందో, ఎక్కడ దిగుతుందో తెలియదు. అది క్షేమంగా కిందికి దిగటానికి తామేం చెయ్యగలరో విధివిధానాలు తెలియవు. అయితే ప్రయాణం సులువుగా ఉంటుంది.

ఈ విధానంలో ఉద్యోగి ఒక ప్రాజెక్టు నుంచి యింకో ప్రాజెక్టుకి గెంతుతాడు. ఏ రంగంలోను ప్రత్యేక నైపుణ్యం సంపాదించకుండానే గోళమంతా తిరుగుతాడు. ఎప్పటికప్పు డు పాతది మర్చిపోయి కొత్త ప్రాజెక్టుకి అవసరమైన కొత్త నైపుణ్యం సంపాదించటమే. మారుతున్న ప్రపంచంలో తెలివిగా, హుందాగా, నీతిగా ప్రవర్తిస్తూ విజయం సాధించటమే పెద్ద సమస్య. 'ప్రజలే చరిత్రను నిర్మిస్తారు; కాని అది వాళ్ళకి నచ్చిన పరిస్థితుల నుంచి కాదు' అని కార్ల్ మార్క్స్ ఎన్నడో చెప్పిన మాట ఉదాహరిస్తూ బౌమన్ 'నువ్వు పని చేసే ప్రపంచం నువ్వు నిర్ణయించుకొన్నది కాదు' అన్నాడు. అంటే నువ్వు సాధించాలనుకొన్నదానికి, సాధ్యమయ్యేదానికి మధ్య ఘర్షణ ఉందన్నమాట.

ఇప్పటి కార్పొరేట్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ద్రవాధునిక భావన బాగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్లు, అంతర్జాలాలు, సెల్‌ఫోనులు, ఆన్‌లైన్ కాన్ఫరెన్సులు నిండిన ఈ ప్రపంచంలో ఉద్యోగికి స్థలంతో సంబంధం లేదు. అతను బంధరహితుడు, అస్థిరుడు. అతను ఈ దేశంలోనో, అమెరికాలోనో ఉండి పరదేశాల్లో క్లయింటుల అవసరాలు తీరుస్తాడు. తన పని ద్వారా ఏ ఉత్పత్తి జరుగుతుందో అతనికి తెలియదు. తెలియాల్సిన అవసరమూ లేదు. కంటికి కనపడని ఏ లక్ష్యం కోసమో అతను పని చేస్తాడు. తన అసలు యజమానిని అతను కలలోనైనా చూసి ఉండడు. చూసేదల్లా తనపై మేనేజర్లని, తన సమాచారం, లేదా 'జ్ఞానం' అందిపుచ్చుకొనే నలుగురైదుగురు సాటి ఉద్యోగుల్ని. ఆలోచనలు, డిజైన్లు, అంచనాలు తప్ప శరీరంతో చేసే పనేమీ ఉండదు. కీబోర్డు మీటలు నొక్కటమే అతని ప్రధాన శారీరక శ్రమ. కళ్లముందు ఏ ప్రాంతం లేదు. భౌతిక నిర్మాణం లేదు. ఉన్నదంతా కంప్యూటర్‌లో కనపడే ఆభాస వాస్తవికతే (virtual reality). ఈ సరికొత్త ప్రపంచాన్ని, అందులోని అస్థిర సంబంధాల్ని మన రచయితలు లోతుగా అన్వేషించాల్సి ఉంది.

ద్రవాధునికతలో ప్రపంచీకరణ ఉంది; వలసలున్నాయి. సంచార జీవనం ఉంది; అంతర్జాలం ఉంది; సెల్‌ఫోన్లు ఉన్నాయి. జీవితంలో మార్పు అనేది ఇవాళ 'శాశ్వత' పరిస్థితి. మార్పు లేని గానుగెద్దు పద్ధతి ఇంక కుదరదు. ఏదో ఒక గత ఉదాహరణని అనుసరించటం 'మంచిది' కాదు. జ్ఞానం సంపాదించి, దానిమీదనే ఆధారపడటం ఇవాళ 'తెలివైన ప్రతిపాదన' కాదు. అంటే ఏవో కొన్ని స్థిరమైన అభిప్రాయాలను అంటిపెట్టుకొని బ్రతకటం గాక ఎప్పటికప్పుడు మారే పరిస్థితుల కనుగుణంగా మారుతూ పోవటమే నేటి జీవన విధానంగా బౌమన్ గుర్తించాడు. ఈ జీవన విధానంలో 1. అపాయం, 2. అస్థిరత్వం, 3. దుర్బలత్వం (vulnerability) అనే లక్షణాలు కూడా గమనించాడు. అభద్రతే వాటి సారాంశం. అయితే సామాజిక శాస్త్ర వికాసంతో, నిర్ణయ స్వేచ్ఛతో కూడిన ఉన్నత సమాజంలో మనుషులు తమ జీవితాల్ని అర్థవంతం చేసుకోగలరని బౌమన్ ఆశించాడు.
ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ (assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ ఉంది. ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమం కూడా కన్పిస్తుంది. ముఖ్యంగా విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ఈ సరికొత్త పరిణామాన్ని తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాద ఘంటికలూ వినగలం. ప్రపంచీకరణకి, ద్రవాధునికతకి గల రక్త సంబంధాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది. ఈ గుర్తింపు మన సాహిత్య వస్తువులో నూతన ఆవిష్కరణలకి దారి తీస్తుందని నా నమ్మకం.

విమర్శ సృజనాత్మక కావ్యం

విమర్శ సృజనాత్మక కావ్యం
రచన: పాపినేని శివశంకర్ జూన్ 2018

అవును. విమర్శ గొప్ప సృజనాత్మక వ్యాపారం అని నా అభిప్రాయం. సృజనాత్మకత లేని విమర్శ సారం లేని పిప్పిలా, ఎండు గడ్డిలా కనిపిస్తుంది నాకు. అందులో రుచి తగలదు. దేన్ని నువ్వు సృజిస్తావు అందులో? సాధారణ విషయాల్ని విమర్శించటానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అవి నీ కల్పనని ప్రేరేపించవు. కాని ఒక కొత్త విషయం సాహిత్య ప్రపంచంలో ఆవిష్కరించబడినప్పుడు దాన్ని నువ్వు పాత సాధనాల్తో తవ్వి తలకెత్తలేవు. పై పొరల్లోనే ఆగిపోతావు. రససిద్ధాంతంతో మహాప్రస్థానం రచనని విశ్లేషించిన వాళ్లున్నారు. అందువల్ల తగు మోతాదులో రసానందం పొందగలం. కాని అందులో ఏ సామాజిక వర్తమానాన్ని కవి నిరాకరిస్తున్నాడు? ఎటువంటి ప్రపంచాన్ని కలగంటున్నాడు? ఆ కలకి ప్రేరణ ఏమిటి? ఆ కల సాకారం కావటానికి జనం చెయ్యాల్సిన త్యాగం ఏమిటి? ఇవేవీ ఆ విమర్శలో తర్కించబడవు గాక బడవు. అప్పుడు నీకు వర్తమానత (Contemporaneity) అనే ప్రమాణం అవసరమవుతుంది. సామాజిక చైతన్యం అనే ప్రమాణం కావాల్సివస్తుంది. అటువంటి మరికొన్ని ప్రమాణాలతో మాత్రమే ఆ రచనని విలువ కట్టగలం. అంటే ఒకానొక కాలపు సాధనాలతో అన్నిసార్లు మరో కాలపు సాహిత్యాన్ని సమగ్రంగా అంచనా వెయ్యలేం. కొత్త సాధనాలేవో అవసరమవుతాయి. అక్కడే విమర్శకుడు సృజనశీలి కావాలి.

ఆధునిక కవిత్వంలో అస్పష్టత గూర్చి నేను రాయాల్సివచ్చినప్పుడు ఇంతకీ అస్పష్టత అంటే ఏమిటనే ప్రశ్న ఎదురయింది. అందరూ ఆ మాట అనేవాళ్లే గాని దాన్ని ప్రాథమికంగా నిర్వచించిన వాళ్లు లేరు. అప్పుడేమవుతుంది? అస్పష్టత గూర్చి మనం ఏ విమర్శ చేస్తున్నామో మాట్లాడుతున్నామో అది కూడా అస్పష్టంగా మిగిలిపోతుంది. కనుక దాన్ని ఒక భావనగా నేను నిర్వచించుకోవాల్సి వచ్చింది. ‘కవి పాఠకుల మధ్య ఏర్పడిన అసంబంధ ఫలితమే అస్పష్టత’ అని నా నిర్వచనం. ఎప్పుడైతే ఆ నిర్వచనం చెయ్యగలిగానో అప్పుడిక ఆ విషయం గురించి విశ్లేషించటం, కొన్ని నిర్ధారణలు చెయ్యటం తేలికైంది. ఆ నిర్వచనం చెయ్యటం అంటే ఒక కొత్త సాధనాన్ని సృజించటమే. అట్లాగే అశ్లీలం గురించి ‘స్త్రీ పురుష లైంగిక సంబంధాన్ని కించ పరచటమే అశ్లీలత’ (The disgrace of the sexual relation between a man and woman is obscenity) అని నిర్ధారించాను. ఇట్లా కొన్ని భావనల్ని నిర్వచించగలిగి నప్పుడు ఆ విషయం లోలోతుల్లోకి తేలిగ్గా స్పష్టంగా వెళ్లగలం. వస్తువు, రూపం, అస్పష్టత, సంక్లిష్టత, స్తబ్ధత, అశ్లీలం మొదలైన భావనల వివరణతో సాహిత్యం-మౌలిక భావనలు అనే పరిశోధన గ్రంథం వెలువరించాను.

సాహిత్యవిమర్శలో సాహిత్యేతర సాధనాలు కూడా ఉపకరిస్తాయని నా అవగాహన. ఉదాహరణకి మనం ధాన్యాన్ని కొలవాలంటే సంప్రదాయబద్ధంగా గిద్ద, సోల, మానిక వంటి కొలమానాల్ని ఉపయోగిస్తాం. అయితే దాన్ని చేటతోనైనా కొలవవచ్చు. దానితో కొలిచేటప్పుడు ధాన్యాన్ని విరివిగా, వివరంగా చూసే అవకాశం ఉంటుంది. అట్లాగే సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు అన్ని సార్లూ సాహిత్యసాధనాలు చాలవు. సాహిత్యేతర సాధనాలు కూడా అక్కరపడతాయి. అప్పుడు తత్త్వశాస్త్రం, భాషాశాస్త్రం, సామాజికశాస్త్రం మొదలైనవాటిని ఆశ్రయిస్తే తప్పులేదు. నాకు తెలిసినంతలో ఆచార్య చేకూరి రామారావు చేరాతలులో ఆధునిక కవితల్ని విశ్లేషించటానికి భాషాశాస్త్ర పరిభాషల్ని, భావనల్ని సమర్థంగా వాడుకొన్నాడు.

ఒకానొక సందర్భంలో మన సాహిత్య చరిత్రలో పాత, కొత్త ధోరణులు కొన్ని సహజీవనం చేస్తున్నట్టు గుర్తించాను. ఎంతో అభ్యుదయం సాధించామనుకొంటున్న దశలోనూ వెనకటి పద్ధతులు సమాజంలో, సాహిత్యంలో కొనసాగుతున్నట్టు బోధపడింది. దానినిఎట్లా అర్థంచేసుకోవాలో, ఎట్లా సూత్రీకరించాలో తెలియలేదు. ఆ సమయంలో దామోదర్ ధర్మానంద కోశాంబి An Introduction to the Study of Indian History అనే రచన నాకు తోడ్పడింది. ఆ విశిష్ట చరిత్రకారుడు భారతీయ సంస్కృతిలోని ఒక అవిచ్ఛిన్న లక్షణాన్ని గుర్తించాడు. పూర్వస్థితి ఎంతోకొంత ఉత్తర స్థితిలోనూ కొనసాగటం అది. తెలుగు సాహిత్య చరిత్రలోనూ ఆ లక్షణం ఉంది. దాన్ని కనుగొని, కొన్ని ప్రతిపాదనలు చెయ్యటానికి ‘అవిచ్ఛిన్నత’ అనే భావనని రూపొందించుకొన్నాను. ‘తెలుగు సాహిత్యంలో అవిచ్ఛిన్నత’ అనే వ్యాసం ద్వారా ఆ పని చేశాను.

విమర్శకుడికి సృజనాత్మకత మరో విషయంలోను అవసరమే. ఒక సృజనాత్మక విషయాన్ని లోతుగా అవగాహన చేసుకోవటానికి, ఆవిష్కరించటానికి కేవలం విమర్శకుడి తెలివితేటలు చాలవనుకొంటాను. అతడు స్వయంగా కవి అయితే కవితా సృజనలోని ఆల్కెమీ తేలిగ్గా అర్థంచేసుకోగలడు. సృజన క్రమంలో కవి హృదయంలో జరిగే సాగరఘోష వినగలడు. కవి కానివాడు శ్రీశ్రీ ‘కవితా! ఓ కవితా!’ సంపూర్ణంగా అర్థంచేసుకోలేడని, ఆవిష్కరించలేడని నా నిశ్చితాభిప్రాయం. అట్లాగే మంచి కథకుడు కానివాడు ఒక గొప్ప కథ ఆత్మని సంపూర్ణంగా పట్టుకోలేడు. సృజన క్రమంలో కవి/రచయిత అంతర్లోకంలో జరిగే రసాయన చర్య అటువంటి క్రమంలో ఉన్నవాడికే పూర్తిగా అర్థమవుతుంది. (ఈ మాటకి అందరూ తల ఊపుతారని నేననుకోవటం లేదు.)

తెలుగులో ప్రాచీన కవిత్వానుశీలన చాలాకాలం రస సిద్ధాంతం, నాయికా నాయకులు, అలంకారం, వర్ణన మొదలైన ప్రమాణాలతో సాగింది. వాటిని ఆధునిక సాహిత్యానికీ యథాతథంగా అన్వయించే వాళ్లున్నారు. ఈ ప్రమాణాలకు సంస్కృత అలంకారశాస్త్రం ఆధార భూమిక. ఇది క్రమక్రమంగా ఒక మూస పద్ధతికి దారితీసింది. ఈ మూసను బద్దలు గొట్టినవాడు కట్టమంచి రామలింగారెడ్డి. అతని కవిత్వ తత్త్వ విచారము ఆధునిక విమర్శకు నాంది. ‘వికృతులు లేని పాత్రలు జడసమానములు’ అని ఆయన తీర్మానం. పాత్రలు శుద్ధ చరిత్రలుగా కాకుండా మిశ్ర చరిత్రలుగా ఉండాలనటం అప్పటికి మిక్కిలి కొత్త మాట. ‘విపరీతాలంకార రచనకు ప్రేరేపకము భావశూన్యత’ అని తేల్చాడు కట్టమంచి. ‘వర్ణనముల కన్న అంగాంగ సాంగత్యము కావ్యముల శ్రేష్టము’ అని చెప్పాడు. ఇంచుమించు ఆయనకు సమకాలంలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ సాహిత్యాధ్యయనంలో అభిరుచి, స్పందనల పాత్ర గురించి పరిశీలించాడు. వేమన వంటి మౌలిక అన్వేషకుల్ని వెలుగులోకి తెచ్చాడు. సాహిత్యంలో సంస్కారానికి ఉండాల్సిన స్థానం గురించి చక్కని ప్రతిపాదనలు చేశాడు. ఆ విషయంలో తనకు ఆరాధ్యుడైన కట్టమంచిని ఖండించటానికీ ఆయన వెనుకంజ వెయ్యలేదు. ఇటువంటి మౌలిక విమర్శకులే మనకవసరం.

తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి ఘటికుడైన విమర్శకుడు. చాలా తీవ్రమైన నిర్ధారణలెన్నో చేశాడు. ఏ మాత్రం మొహమాటం, కనికరం లేకుండా నిష్కర్షగా తన ప్రతిపాదనలు చేశాడు. అటువంటి మేధావిని శ్రీశ్రీ ‘క్రూరుడైన విమర్శకుడు’ అన్నాడు. విమర్శలో క్రూరత్వం ఏమిటి? విషయకాఠిన్యం వేరు; భాషణ కాఠిన్యం వేరు. ఒక విమర్శ విషయపరంగా ఎంతో తీవ్రంగా ఉండవచ్చు. దాన్ని సరైన రీతిలో వ్యక్తీకరించటంలోనే ఉంటుంది సమస్య. దిగంబరకవుల కవిత్వాన్ని తూర్పారబట్టవచ్చు. కాని వాళ్లని అరిషడ్వర్గాలుగా అవమానించటం సరి కాదు. అది వ్యక్తిగతమైన దూషణ. అటువంటి వ్యాఖ్యలే శ్రీశ్రీకి బాధ కలిగించి ఉంటాయి. కాగా విమర్శలో వ్యంగ్యం ఉంటే ఆ విమర్శ పదునెక్కుతుంది. అయితే వ్యంగ్యానికి, వెటకారానికి తేడా తెలియాలి. మార్కిస్టు పంథాలో రంగనాయకమ్మ గొప్ప విమర్శకురాలు. వ్యంగ్యాన్ని బాగా పలికిస్తుంది. అయితే ఒక్కోసారి అది మితిమీరి వెటకారానికి దారితీస్తుంది. ఆమె బలమైన బలహీనత అదే. వేమన కవిత్వాన్ని విలువగట్టేటప్పుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ చక్కని వాఖ్యానం చేశాడు. వేమనది తిట్టుచునే నవ్వించు హాస్యకుశలత అని, అది గాయపుమందు కత్తికే పూసి కొట్టినట్టుంటుందని ఆయన పరిశీలన. అట్లాగే తీవ్రమైన విమర్శ అయినా రచయితను వ్యక్తిగతంగా నొప్పించకుండా ఉండాలని నా అభిప్రాయం. ఈ విషయంలో కొడవటిగంటి కుటుంబరావు చాలా వస్తుగత దృష్టితో విమర్శ సాగించినట్టు తెలుస్తుంది. కొ.కు. విమర్శలో స్పష్టత, పదును ఉంటాయి. వ్యంగ్యం ఉంటుంది. అనవసర హేళన, వెటకారం ఉండవు.

ఇక్కడ ఒక పాత సంగతి మళ్లీ గుర్తించాలనిపిస్తుంది. కావ్యపాఠకుడు సహృదయుడై ఉండాలని ప్రాచీన విమర్శకులు (ఆలంకారికులు) చెప్పారు. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకానికి లోచనవ్యాఖ్య చేస్తూ అభినవగుప్తుడు సహృదయుడికి ఒక చక్కని నిర్వచనం చేశాడు. ‘యేషాం కావ్యానుశీలనాభ్యాసవశాత్ విశదీభూతే మనో ముకురే వర్ణనీయ తన్మయీభవనయోగ్యతా తే హృదయసంవాదభాజః సహృదయాః’. నిరంతర కావ్యపఠనం వల్ల పాఠకుడి మనస్సు విప్పారుతుంది. అద్దంలాగా మారుతుంది. కవి వర్ణించే విషయంతో తన్మయత్వం కలుగుతుంది. ఆ విధంగా కవి హృదయంతో సమానమైన హృదయం గలవాడే సహృదయుడని ఆ నిర్వచన సారాంశం. హృదయ సంవాదం అనేది ఇక్కడ ముఖ్యమైన మాట. కవి/రచయిత ఏ హృదయధర్మంతో రచన చేశాడో ఆ హృదయధర్మం ప్రాథమికంగా కలిగి ఉండాలి పాఠకుడు. అంటే ముందుగానే ఏర్పరుచుకొన్న భావాలతో రచనను చూడరాదని తాత్పర్యం. రచన అంతా చదివినాక ఆ కవి/రచయిత అభిప్రాయాలతో విభేదించవలసి వస్తే వేరే సంగతి. అభినవగుప్తుడు ఈ నిర్వచనం దృశ్యకావ్యాన్ని తిలకించే ప్రేక్షకుడి గురించి చెప్పాడు. అది శ్రవ్యకావ్యానికీ అన్వయించుకోవచ్చు. అప్పుడు సహృదయుడైన పాఠకుడనీ అనుకోవచ్చు. ఈ సారాంశం కేవలం పాఠకుడికేగాక విమర్శకుడికీ అన్వయించుకోవచ్చు. పురస్సిద్ధాంతాలతో ఆయా రచనల్ని ముందస్తుగానే వ్యతిరేక దృక్పథంతో చూడరాదని తెలుసుకోవాలి. సహృదయత అంటే అంతిమంగా సాహిత్య సంస్కారమే.

ఏ సాహిత్యాన్ని గాని పరిశీలించి, సారగ్రహణం చెయ్యటానికి ఏదో ఒక సిద్ధాంతం చాలదు. ఆ మాటకొస్తే ఏ సిద్ధాంతమైనా సర్వసమగ్రం కాదు. అది కొన్ని జ్ఞాన సంబంధమైన, కాలసంబంధమైన పరిమితులకి లోబడుతుంది. అది తెలియని వాళ్లు తాము ఇష్టపడే సిద్ధాంతం ప్రాపంచిక సమగ్రతను ఏ మినహాయింపూ లేకుండా వ్యాఖ్యానించగలుగుతుందనుకొంటారు. ఇతర సిద్ధాంతాలను పట్టించుకోరు. పట్టించుకొంటే తమ పునాదులు కదలిపోతాయని లోలోపల భయం. ఇది నిశ్చయంగా సంకుచిత స్వభావమే. మాట వరసకి ఒక సిద్ధాంతం సర్వ సమగ్రమే అనుకుందాం. అది ఒకప్పటి ప్రాపంచిక వాస్తవికతని సరిగ్గా వ్యాఖ్యానించిందనే అనుకుందాం. ఆ ప్రాపంచిక వాస్తవికత ఎల్లకాలం అదే విధంగా ఉంటే ఆ సిద్ధాంత అన్వయాన్ని తప్పుబట్టనక్కర్లేదు. అయితే ప్రపంచంలో అన్నీ నిరంతరం మారుతుంటాయనేది ప్రాథమిక సత్యం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయి. వాటివల్ల జీవన విధానాలు మారుతుంటాయి. భౌతిక ఉత్పత్తి రంగంలో సాఫ్ట్‌వేర్ ప్రవేశంతో ఉత్పత్తి స్వరూప స్వభావాలే మారిపోయాయి. పెట్టుబడి మిక్కిలి తేలిగ్గా భూగోళం ఒక ధ్రువం నుంచి మరో ధ్రువానికి ప్రయాణించగలుగుతుంది. వర్గ నిర్వచనాలూ మారిపోయాయి. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ మొదలైన సాధనాలతో సమాచారరంగం విద్యుత్ వేగాన్ని అందుకొంది. సిద్ధాంతాన్నిబట్టి ఆచరణని తూకం వేస్తాం. అదే సందర్భంలో మారిన కాలమాన పరిస్థితుల్నిబట్టి సిద్ధాంతం కూడా తనను తాను మార్చుకోవాల్సి ఉంటుంది. న్యూటన్, ఐన్‌స్టీన్ లాంటి మహామహులు చేసిన సిద్ధాంతాలకు కాలక్రమంలో కొన్ని సవరణలు చెయ్యబడటం మనకు తెలిసిన విషయమే. అట్లాగే సాహిత్య సిద్ధాంతాలకూ మార్పులు, చేర్పులు తప్పవు. ఒక సిద్ధాంతం కలకాలం ఏ మార్పూ లేకుండా ఉందంటే దాన్ని తప్పకుండా అనుమానించాల్సిందే. అది అక్కడే నిల్చిపోయిందని, దానితో మెల్లమెల్లగా మన అవసరం తీరిపోతుందని కూడా తెలుసుకోవాలి.

1980 తర్వాత తెలుగు సాహిత్యంలో ఆధునికానంతర ధోరణులను గుర్తించే ప్రయత్నం జరిగింది. విశ్వజనీనతని ప్రశ్నించటం, మహాకథనాలను తిరస్కరించటం, విఘటనం, వాచక బహుళత్వాన్ని గుర్తించటం మొదలైన పద్ధతులు ఆధునికానంతర విమర్శలో ఉంటాయి. ఈ కొత్త ధోరణులను బి. తిరుపతిరావు బలంగా ప్రతిపాదించాడు. మార్క్సిస్టు సిద్ధాంతవాదులకు మింగుడుపడని రీతిలో వచ్చిన స్త్రీవాద, దళిత వాదాలు మొదలైనవాటిని ఆధునికానంతరవాదాలుగా నిరూపించే ప్రయత్నం జరిగింది గాని అది నెరవేరలేదు. అయితే కొత్త ఆలోచనాధోరణులకు అది తెర తీసిందని మాత్రం చెప్పవచ్చు. ఆధునికానంతరవాదాన్ని ఒక లక్షణంగా కాకుండా ఒక దశగా గుర్తించటం ఆ వాదంలోని లోపమనిపిస్తుంది.

ఆధునికోత్తరవాదం విడి విడి అస్తిత్వాలను గుర్తిస్తుంది. పరిశీలిస్తుంది. కాని వాటి మధ్య అంతస్సంధానం, కలయికల గురించి ఏమీ మాట్లాడదు. వాటిని కలిపే పనిముట్లు దాని వద్ద దొరకవు. అవి లేకుండా ఆధిపత్య వ్యవస్థల్ని విడివిడిగా ఎదుర్కోవటం కష్టం. దళిత, స్త్రీ అస్తిత్వాల దగ్గరికి వద్దాం. అవి ఆధునికానంతరవాద ఉద్యమాలు కాజాలవు. దళితవాదం పూర్తిగా స్థానికం. దానికొక రాజకీయార్థిక సామాజిక దృక్పథం, ఆ పైన ఉద్యమాచరణ ఉన్నాయి. ఆ భూమిక నుంచి ఆధునికానంతరవాదం దళితవాదాన్ని, ఆ సాహిత్యాన్ని పరిశీలించలేదు. ఇక ఆ వాద విపులత్వం, ఉద్యమస్థాయి స్త్రీవాదానికి లేవు. అయితే ఆధునికానంతరవాద ప్రభావం దాని మీద ఉంది. ప్రస్తుతం తలెత్తుతున్న రకరకాల అస్తిత్వవాదాలకు ఆధునికానంతర భావజాలానికీ ఏమైనా చుట్టరికం ఉందా అనేది పరిశీలించాలి.

సమాజ జీవనం ద్రవాత్మకంగా మారిందని, ద్రవప్రపంచంలో మానవ సంబంధాలు బలహీనమవుతున్నాయని, వస్తువినియోగతత్వం మానవసంబంధాలలోనూ జొరబడిందని జిగ్మంట్ బౌమన్ గుర్తించాడు. వర్తమాన జీవితంలో మూడు లక్షణాలు పసిగట్టాడు. 1. అపాయం, 2. అస్థిరత్వం, 3. అరక్షణ/దుర్బలత్వం (vulnerability). తమ స్థితిగతుల గురించి అభద్రత, భవిష్యత్తు గురించి అనిశ్చితి, తమ శరీరం మొదలు కలిమి దాకా క్షేమరాహిత్యం – ఇవన్నీ ఆ కష్టాల రూపాలు.

నేటి కార్పొరేట్ ప్రపంచాన్ని అర్థంచేసుకోవటానికి ఈ ద్రవాధునిక భావన బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పెట్టుబడి ప్రపంచంలో ఏ మూలనుంచి ఏ మూలకైనా పరిగెత్తుతుంది. ప్రపంచీకరణలో భాగంగా జరిగిన ఒక ముఖ్య పరిణామం ఏమిటంటే పారిశ్రామిక పద్ధతిలో భౌతిక ఉత్పత్తి గాక బౌద్ధిక ఉత్పత్తి విజృంభించటం. సాఫ్ట్‌వేర్ రంగమే దీనికి రామచక్కని ఉదాహరణ. ఇక్కడ కావాల్సింది భౌతికావరణ కాదు, అంతర్జాల ఆవరణ (cyberspace). వందల పనిముట్లు అక్కర్లేదు, చిన్నపాటి కంప్యూటర్ చాలు. ఒడిలో బుల్లి కంప్యూటర్ (Laptop) మరీ మేలు. మానవుడు సృష్టించిన కృత్రిమమేధ మానవుడినే శాసించే పరిస్థితి ఏర్పడింది. మనుషుల మధ్య పూర్వాధునిక, ఆధునిక సమాజాల్లో మాదిరిగా కాక, సామాజిక సంబంధాలు వినియోగ, వస్తు సంబంధాలుగా మారుతున్నాయి. మనుషుల మధ్య అనుబంధాలు (relations) అనుసంధానాలుగా (contacts) మారుతున్నాయి. ముడేసుకోవటం ఎంత తేలికో తెంచేసుకోవటం కూడా అంత తేలికే. వ్యక్తి విచ్ఛిన్నత, పరాయితనం నేటి మనిషి అంతరంగం. ఈ విధంగా బౌమన్ కనుగొన్న అంశాలని మన సమాజానికి, సాహిత్యానికి అన్వయించటానికి ‘ద్రవాధునికత’ అనే భావనని రూపొందించాను. ఇలాంటి కొత్త భావనల పరికల్పన వల్ల విమర్శ సిద్ధాంతం పరిపుష్టమై విమర్శాకార్యం సులభమవుతుందని నా అభిప్రాయం. కొత్త కొత్త సాహిత్యప్రాంతాలను గుర్తించటం కూడా విమర్శకుడికి చాలా అవసరం. ఈమధ్య కాలంలో స్త్రీవాద, దళిత, మైనారిటీ, ప్రాంతీయవాదాల చుట్టూ సాహిత్య ఉత్పత్తి, విమర్శ ఉత్పత్తి విరివిగా జరుగుతుంది. కాలం గడిచేకొద్దీ చెప్పిన వాటి గురించే చెప్పిందే ఎవరూ చెప్పలేదన్నట్టు మళ్లీ మళ్లీ చెప్పటం వింటున్నాం. పాత విషయాలనే కొత్తగా తవ్వి తీస్తున్నారు విమర్శకులు. అయితే వాదాలెప్పుడూ అసమగ్రాలే అని తెలుసుకోవాలి. అవి జీవిత వాస్తవికతని పాక్షికంగా మాత్రమే ఆవిష్కరిస్తాయి. అది వాటి పరిమితి. వాటికి భిన్నంగా, అతీతంగా పరిశీలించాల్సిన సామాజిక, వైయక్తిక ప్రదేశాలెన్నో ఉన్నాయి.

సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. పొరలు పొరలుగా, గజిబిజిగా, గందరగోళంగా, సంక్లిష్టంగా ఉన్న మానవజీవితాన్ని సాహిత్యం వడకట్టి, దాని సారాంశం తేటతెల్లం చేస్తుంది. అటువంటి సాహిత్యాన్ని పరిశీలించి, శోధించి, తాలు తప్ప వేరు చేసి, విలువ కట్టి, అందులో ఉత్తమమైనదేదో వెలికితీస్తుంది విమర్శ. ఈ కారణంగా సృజన కన్న విమర్శ మరీ కష్టం. ఒక సృజన చెయ్యటానికి ఏ కళాసూత్రాలు తెలియనక్కర్లేదు. కాని ఆ సృజనని విలువ కట్టటానికి కళాసూత్రాలు మొదలు రకరకాల వాదాల, సిద్ధాంతాల పరిజ్ఞానం అవసరం. కనుక సృజనకారుడి పని సులువు. విమర్శకుడి పని కష్టం. నా మట్టుకు నాకు కథ, కవిత్వం కష్టం గాని ఇష్టం. విమర్శ కష్టమైన ఇష్టం.

తెలుగులో కవులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. (ఇప్పుడు కవి కుటుంబ నియంత్రణ దేశానికి చాలా అవసరమని అంటుంటాను!) ఏది అకవిత్వమో, సుకవిత్వమో చెప్పగలిగేవారు కావాలి. మృదువుగాను స్పష్టంగాను ప్రతిపాదనలు చెయ్యగలగాలి. అట్లా చెయ్యగలిగిన గొప్ప విమర్శకులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. విమర్శ నిజాయితీగా, నిర్మలంగా సాగినప్పుడే సాహిత్యానికి కళాకాంతీ.

జిగ్మంట్‌ బౌమన్‌

మీరు చూసే ఉంటారు. రోడ్డుమీద జనమే జనం. మధ్యగా ఒక తాజా మోటర్‌ బైక్‌ మీద పాతికేళ్ళ కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి, భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసుపని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా గురించి ముచ్చటిస్తున్నాడా అనేది మనకక్కర్లేదు. సదరు ద్విచక్రవాహన చోదకుడి పరిస్ధితిలో చలనవేగం ఉంది. అందువల్ల అస్థిరత ఉంది. అందువల్ల అభద్రత ఉంది. అందువల్ల ప్రమాదం ఉంది. ఈ పరిస్ధితేమిటయ్యా అంటే ఉరకలేసే వర్తమానం అంటాడతను. నేను కాస్త గంభీరంగా 'ద్రవాధునికత' అంటాను. ద్రవాధునికత (Liquid Modernity) అనేది ఒక భావన. దాన్ని ఆకళించుకోవటానికి ఆ దృశ్యం చక్కని ఉదాహరణ.
ఇప్పటిదాకా తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, అసలు సంగతి దాన్ని మార్చటమేనన్నాడు చాన్నాళ్ల కిందట కార్ల్‌మార్క్స్‌ మహాశయుడు. అయితే కర్త ఎవరో కనపడకుండా విపరీతవేగంతో మారుతున్న ప్రపంచవ్యవస్థల మధ్య మనమిప్పుడు అవస్థలు పడుతున్నాం. పల్లెలనుంచి పరదేశాల దాకా వలసలు, భూసంబంధాల్లో విస్థాపన (Displacement), మూలాల విచ్ఛిన్నత, రంగులు మారే వస్తు ప్రపంచం, మార్కెట్‌ సంక్షోభాలు, ఉద్యోగ జీవితాల్లో గాలివానలు, సంక్లిష్ట వర్తమానాన్ని కొత్తగా అర్ధం చేసుకోవటానికి, విశ్లేషించి, వ్యాఖ్యానించటానికి, అన్వయించుకోవటానికి జిగ్మంట్‌ బౌమన్‌ (Zygmunt Bauman) వెలువరించిన 'లిక్విడ్‌ మోడర్నిటీ' (Liquid Modernity) అనే పుస్తకం చక్కగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా మార్పుకి తోడ్పడుతుంది.

PAPINENI SHIVASANKAR - ఒక అన్వేషి, కొన్ని ఆలోచనలు

ఒక అన్వేషి, కొన్ని ఆలోచనలు
09-01-2017 02:43:13

https://www.andhrajyothy.com/artical?SID=355329

ఒక భుజమ్మీద కథనీ కవిత్వాన్నీ, రెండో భుజమ్మీద విమర్శనీ సంపాదకత్వాన్నీ మోస్తూ తెలుగు నేల నాలుగు చెరగుల్నీ దుక్కి దున్ని సాహిత్య వ్యవసాయం చేస్తున్న సతతహరిత స్వాప్నికుడు పాపినేని శివశంకర్‌. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యాన్ని తన బహుళ తాత్విక దృక్పథంతో తేజస్వంతం చేస్తున్న శివశంకర్‌ ఇప్పటి వరకు ‘స్తబ్ధత చలనం’, ‘ఒక సారాంశం కోసం’, ‘ఆకు పచ్చని లోకంలో’, ‘ఒక ఖడ్గం ఒక పుష్పం’, ‘రజనీగంధ’ అనే ఐదు కవితాసంపుటులు; ‘మట్టిగుండె’, ‘సగం తెరిచిన తలుపు’ అనే రెండు కథాసంపుటులు; ‘సాహిత్యం-మౌలిక భావనలు’, ‘నిశాంత’, ‘ద్రవాధునికత’ అనే మూడు విమర్శ గ్రంథాలు; ‘తల్లీ! నిన్ను దలంచి’ అనే ప్రాచీన కవిత్వ వ్యాఖ్యానం వెలువరించారు. శివశంకర్‌ ‘రజనీగంధ’ కవితా సంపుటికి 2016 కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించిన సందర్భంలో ఆయనతో కొప్పర్తి జరిపిన సంభాషణ ఇది:

ఇంతకీ ‘రజనీగంధ’అంటే ఏమిటి?
రజని అంటే రాత్రి కదా? రాత్రిపూట సువాసనలీనే పువ్వు రజనీగంధ. దాన్ని రూపకంగా (Metaphor)) గ్రహించటం అది. మనుషులు అస్పష్టమవుతున్న, అస్వచ్ఛమవుతున్న, సమాజం నలుపుకు మారుతున్న సందర్భం ఇది. ఈ పగటి రాత్రివేళ వీచే స్వచ్ఛ సుగంధ పవనమే రజనీగంధ అనుకోవచ్చు.

‘స్తబ్ధత - చలనం’తో ప్రారంభమై ‘రజనీగంధ’ దాక సాగిన శివశంకర్‌ కవిత్వ ప్రయాణ అంతస్సూత్రం?
ఆ కవిలోని, కవి చుట్టూ సమాజం లోని స్తబ్ధతను బద్దలుగొట్టే ప్రయత్నమే ‘స్తబ్ధత - చలనం’. ‘‘శివశంకర్‌! శివశంకర్‌! ఎన్నడూ మరణించకు, ఈ పగటి చీకటిరాత్రి అమృతం కోసం నీ అన్వేషణ మానకు’’ అంటూ ‘ఒక సారాంశం కోసం’ సాగిన దశ రెండవది. ‘ఆకుపచ్చని లోకంలో’ జరిగే ప్రాకృతిక మానవ విధ్వంస తిరస్కరణ మూడవ దశ. అమానవీయతపై ఆగ్రహ ప్రకటన, మానవీయ విలువలపై ప్రేమ ‘ఒక ఖడ్గం ఒక పుష్పం’. పరిపక్వ దశ ‘రజనీగంధ’.

‘రజనీగంధ’ ఏకకేంద్ర కవిత్వరచనగా అన్పించదు. అందులోని వైవిధ్యమే దానికి కారణమా?
రజనీగంధ వైయక్తిక సామాజిక కవిత. అది ఏకధార గాదు. అందులో తన అనుభూతుల్ని అనుభవాల్ని క్షాళన చేసుకుంటూ ప్రకృతితో, సమస్త ప్రాణిలోకంతో మైత్రి నెరపే ప్రాకృతిక, నిసర్గ మానవుడు మీకు కనపడతాడు. ఈ సంపుటిలో ఆధారం కన్న ఆధేయం ప్రధానం. అంటే వస్తువు కన్న ఆ పునాది మీద చేసిన దర్శనమే ప్రధానం. ‘చెప్పులు మీద’, ‘కాసేపు ఎలుకల గురించి’ రాసినప్పుడు అవి ముఖ్యం కాదు. దర్శనానంతరం ఆ వస్తువు అదృశ్యమై కవిలో, కవితాప్రేమికుడిలో అంతిమంగా ఒక జీవన సౌరభం మిగులుతుంది. అది సాధారణ కవిత్వ ప్రమాణాల్లో ఒదగకపోవచ్చు.
 
జీవితాన్ని ఉన్నతీకరించటమే కవిత్వం చేసే పని అన్న శివశంకర్‌ ‘జీవితం అద్భుతపుష్పం వికసించే ప్రక్రియ’ అనగలగటం ఆ ప్రాసెస్‌ ఫలితమేనా?
అవును, కచ్చితంగా. జీవితాన్ని ఉన్నతీకరించటమంటే దాని సారాంశాన్ని గుర్తించి, గ్రహించి, ఆవిష్కరించటం. ధనదాహాలు, అహంభావాలు, అసూయలు, ముసుగులు, కపటాలు, డొల్లతనాలు, నిర్జీవవాక్యాలు - వికసిస్తున్నామని అనుకొంటూ వాడిపోతున్న బతుకులివి. ఒకే ఒక్కసారి వికసించే అద్భుత పుష్పంగా జీవితాన్ని చూడగలిగితే ఆ సౌరభాన్ని కలకాలం ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా వెదజల్లాలో అర్థమవుతుంది.

శివశంకర్‌ వైయక్తిక అనుభవాల్నీ, తనకిష్టమైన వ్యక్తుల్నీ కవిత్వీకరించినప్పుడు పతాకస్థాయి చేరుకు న్నట్టు అనిపిస్తుంది?
ఏ కవికైనా బాహ్య, లేదా సామాజిక విషయాల వ్యక్తీకరణలోకన్నా స్వీయానుభవ వ్యక్తీకరణలోనే ఆత్మీయత ఉంటుంది. గాఢత ఉంటుంది. బాహ్య విషయాల్ని బాగా ఆత్మీకరించుకోగలిగినప్పుడూ ఆ గాఢత ఉంటుంది. కొన్నిటిని కేవలం బాహ్యంగానే ఎదుర్కొంటే కవి పల్చనై తేలిపోతాడు. అత్యున్నతస్థాయిలో కవి తలపడే వస్తువులో వైయక్తిక, సామాజికాల సరిహద్దురేఖ తొలగిపోతుంది. ఉదాహరణకి ‘పెంపకం’ కవిత కవి యొక్క పిల్లల పెంపకంతో ముగిసి చదువరుల పెంపకంలోకి తీసుకు వెళ్తుంది. That is subjective and objective as well.  ఆంతరంగికం చేసుకోని ఏ బాహ్య విషయాన్నీ శివశంకర్‌ ముట్టుకోలేదు. వైయక్తిక అనుభవాల్ని కవిత్వీ కరించినప్పుడు- He reaches the highest point of expression. ‘స్త్రీ‌లు భూదేవతలు, సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్లు’ అనటం అటువంటి ఒక పతాకస్థాయే.

వైరుధ్యాలుగా కన్పించే అంశాలను కూడా నిస్సంకో చంగా, నిర్భయంగా వ్యక్తీకరించగలగటానికి (ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ నగ్నచిత్రాలను విమర్శించటం, ఒక ప్రజానాయకుడి అకాల మరణాన్ని సకాలం అనటం, దేశీయత లేని క్రికెట్‌ వ్యామోహాన్ని ఖండించటం, వివేకానందుడిని ప్రశంసించటం మొ.) - Can we say that he has liberated himself from typical attitudes
Certainly. సర్వజనామోదం పొందే విషయాలను గూర్చి రాయటం సుకరంగా ఉంటుంది. అవసరమైనప్పుడు కవి వాటి నుంచి, ఆ విధంగా తన సంకెళ్ల నుంచి తాను విముక్తుడు కావాలి. ఎవరో నిన్ను అభ్యుదయవాది అనుకోరని ఎం.ఎఫ్‌. హుస్సేన్‌ అరాజక ‘స్‌వేచ్‌ఛ!’ని ఖండించకపోతే ఎట్లా? సంప్రదాయవాది అనుకొంటారని ‘వివేకవాక్యం’ రాయకపోతే ఎట్లా?

అస్తిత్వ ధోరణులకు భిన్నంగా కవిత్వం రాయగలగ టానికి కవి ఆయా వర్గాలకి సంబంధించిన వ్యక్తి కాకపోవటం కారణమా?
ఏ వాదమైనా ఒక విషయాన్ని ప్రత్యేకంగా పైకెత్తు తుంది. అదే సమయంలో ఒక పరిమితికి కూడా లోనవు తుంది. పూర్వం పట్టించుకోని విషయాల పట్ల ఒక ఎరుక, చైతన్యం కల్గించాయి అస్తిత్వవాదాలు. అదే క్రమంలో అవి మన దృక్పథాన్ని విశాలం చేశాయా? మనమెందుకు ఇరుకయ్యాం? ఆలోచించాలి. అస్తిత్వవాదాల పట్ల సానుభూతితో కొన్ని కవితలు రాసినా, అపరిమిత మానవాస్తిత్వమే శివశంకర్‌కి విషయం.

ఆధునిక కవి నిరంతరం కొత్త పరిభాష రూపొందిం చుకోవాలంటాడు శివశంకర్‌. అది ఎలా జరిగింది?
ప్రతి కొత్త వస్తువూ కొత్త అభివ్యక్తిని అపేక్షిస్తుంది. ‘రజనీగంధ’లో ఏ కవిత రూపురేఖలు దానివే. అరిగిపోయి న మాటలుండవు. కవి తనదైన వ్యక్తీకరణ, భాష, ఇమేజరీ సృష్టించుకొన్నప్పుడే కవితకి నూతనశక్తి. ‘రజనీగంధ’లో అటవీసముద్రాలు, సముద్రపుటెడారులు, తావుల తలపులు, రుధిరజల జ్వాలలు, వినీల గానమోహిత గగనాలు, వాంఛా కల్లోల రాత్రులు, చిట్లిన కలల గాజుబొమ్మలు మొదలైన పదకల్పనలు; అమెరికేండియా, బాక్టీరియోదకం, అవగుణసంధి లాంటి ప్రయోగాలు మీకు తగుల్తాయి. దురదృష్టం కొద్దీ మనకు వస్తువు మీద ఉన్న శ్రద్ధ రూపం మీద, అందులో శిల్పం మీద, భాషమీద లేదు.

అట్లా కొత్త పరిభాష రూపొందించుకోవటంలో ప్రాచీన పద్యకవిత్వ అధ్యయనం అతనికేమైనా తోడ్పడిందా?
నిస్సందేహంగా. ఆధునిక కవికి సామాజికత, సృజనా త్మకత మాత్రమే చాలవు. భాషాసంపద, వ్యక్తీకరణ వైవిధ్యం, శైలీ వైవిధ్యం చాలా అవసరం. పదాల మధ్య, పదబంధాల మధ్య, వాక్యాల మధ్య లయ సాధించాలి. ఆ లయ తెలిసినప్పుడే ‘సమరసమీరం వీచే ఎడారిసీమలు’ అనే సమరస ప్రయోగం చెయ్యగలం. భావ విశద క్రమం కూడా ఉండాలి. వీటన్నిటికి ప్రాచీన కవిత్వ అధ్యయనం ఎంతో దోహదం చేస్తుంది. నయాగరాని ‘కళ్లెం తెగిన కదన ధవళాశ్వం’ అనటానికి ఊహాశక్తి తోడైతే ‘గాయనీ ధుని, ధునీ గాయని’ అనటానికి ‘నాకధునీ శీకరముల చెమ్మ’ అనే పూర్వకవి ప్రయోగం సాయపడుతుంది. బాల వ్యాకరణంతో సహా వేల పద్యాలు శివశంకర్‌కి కంఠస్థం.

కథ, కవిత్వం, విమర్శ- ముప్పేటలుగా సృజన చేస్తున్న సాహితీ త్రిముఖుడిలో ఏ ముఖం ముఖ్యం?
అతడు ప్రాథమికంగా కవే. కవిత్వానికవసరమైన భావావేశాలు అతనిలో బలీయంగా ఉంటాయి. గుండెతడి, మానసికాగ్ని లేకుండా రాయలేనితనం. ‘ఒక అల, ఒక జ్వాల కలిస్తే నేను’ అంటుంది ఒక కవితావాక్యం. ఆ తర్వాత కథ చాలా ఇష్టం.

జీవితాన్ని సాహిత్యం, సాహిత్యాన్ని విమర్శ, విమర్శని తత్వం ఉన్నతీకరిస్తాయని నమ్మే పాపినేని విమర్శకు తాత్విక భూమిక ఏమిటి?
కథ, కవితల్లో ఒక ఆవిష్కరణ ((Discovery) ఉంటే విమర్శలో ఆవిష్కరణతో పాటు దాని కవసరమైన సాధనాల, భావనల ఆవిష్కరణ, నవీనకల్పన (Innovation) ఉంటాయి. రకరకాల సిద్ధాంతాల నుంచి, శాసా్త్రల నుంచి రూపొందించిన సాధనాలు, భావనలు ఉంటాయి. ‘సాహిత్యం-మౌలికభావన’ల్లో వస్తువు, రూపం మొదలైన కొన్ని భావనలు, సూత్రీకరణలకి మార్క్సిస్ట్‌ ఈస్తటిక్స్‌ అధారం. అవిచ్ఛిన్నత అనే భావనకి కొశాంబి చరిత్ర సూత్రీకరణ, నిసర్గతా భావనకి ఎరిక్‌ ఫ్రామ్‌ చెప్పిన స్పాంటేనిటీ ఆఫ్‌ లైఫ్‌, ద్రవాధునికతకి జిగ్మంట్‌ బౌమన్‌ ఆలోచనాధార ఆధారాలు. ఇక అస్పష్టత, సంక్లిష్టత, అశ్లీలత, పరాయితనం, స్తబ్ధత మొదలైన భావనల్ని తొలిసారిగా నిర్వచించి, సాహిత్యానికి అన్వయించటం ‘సాహిత్యం- మౌలికభావన’ల్లో మీరు చూడవచ్చు.

పాపినేనిది బహుళ తాత్విక దృక్పథం అంటున్నారు. అనేక తత్వాల కలగలుపులో వైరుధ్యం లేదా?
పాపినేని మీద ఉపనిషత్తుల శాంతత, బౌద్ధ మైత్రి, మార్క్సిజం సామాజిక స్వప్నం, అస్తిత్వవాద సారాంశ శోధన, ఎరిక్‌ఫ్రామ్‌ స్వేచ్ఛాదృష్టి- ఇటువంటి ప్రభావాలెన్నో ఉన్నాయి. ఒకప్పుడు వైరుధ్యాలనిపించేవి. ఇప్పుడవన్నీ ఒక సమగ్రతలో భాగాలనిపిస్తాయి.

ఎరిక్‌ ఫ్రామ్‌ అతనికి కల్గించిన ఎరుక ఏమిటి? ద్రవాధునికత ఏ తత్వ పర్యవసాయి?
ఆధునిక వస్తుప్రపంచంలో మానవీయవిలువల్ని ఎట్లా కాపాడుకోవాలో Fear of Freedom, Sane Societyలో చెప్పాడు ఎరిక్‌ ఫ్రామ్‌. స్వేచ్ఛ, శ్రమ, ప్రేమ మూలధాతువులుగా నిసర్గ జీవనం (Spontaneous life) ప్రతిపాదించాడు. ఆ ఎరుక, ధిక్కారం, స్వేచ్ఛా కథావ్యవస్థ మొదలైన ప్రతిపాదనలు ‘నిశాంత’లో ఉన్నాయి. ఇక జిగ్మంట్‌ బౌమన్‌ Liquid Modernity నుంచి ద్రవాధునికత భావన రూపొందింది. అతి వేగంగా మారుతున్న అభద్రత, అస్థిరత మూగిన ఇప్పటి సామాజిక వైయక్తిక జీవనాన్ని విశ్లేషించే సాధనం అది. తద్వారా ప్రపంచీకరణ పరిణామాలతో పాటు సాఫ్ట్‌వేర్‌ శకంలో Light Capitalism గురించి, వినియోగదారుల సమాజంలో వ్యక్తి విహ్వలత గురించి ఆలోచించగలం.

సంపాదకునిగా అతని అనుభవాలేమిటి? అవి అతని సృజనాత్మకతకు అడ్డు రాలేదా?
ఆయా రచనల్ని విలువగట్టటంలో అనుభూతి కన్న విమర్శనాదృష్టి తోడ్పడింది. అయితే సంపాదకత్వం అతని ప్రధానకృషి కాదు. ఒక రకంగా అది తలనెప్పి పని. తల బొప్పికట్టే పని కూడా. ఎంతో సమయం కూడా వెచ్చించాలి. కాకపోతే కొన్ని కొత్తగొంతుల్ని కనుగొన్నప్పుడు, మంచి రచనల్ని పైకెత్తినప్పుడు కొంత తృప్తి.

జాతీయస్థాయిలో గొప్ప గుర్తింపు లభించిన ఈ సందర్భంలో శివశంకర్‌ ఎవరినైనా గుర్తు చేసుకోవాల నుకుంటున్నాడా?
తొలి పాఠాలు నేర్పిన నన్నపనేని అంకినీడు, ఆటల్లో ఆసక్తి రేపిన వలేటి వెంకటేశ్వరరావు, లెక్కల్లో గట్టెక్కించిన పొదిలి సుబ్బారావు, మలి విద్యార్థిదశలో నాగళ్ల గురు ప్రసాదరావు, ఓరుగంటి నీలకంఠశాసి్త్ర, కవి జీవితనిష్ఠ నేర్పిన తెనుగులెంక తుమ్మల - ఎప్పటికీ ముఖ్యంగా వీరిని, మరెందరినో గుర్తు చేసుకుంటూనే ఉంటాడు.

అతని సాహిత్య ప్రయాణాన్ని పరిపుష్టం చేసిన మేధావులు, రచయితలు, పుస్తకాలు...
తొలి ముద్ర ‘Where the mind is without fear'  అన్న టాగూర్‌ది. పూర్వకవుల్లో తిక్కన, పోతన, ఆధునికుల్లో శ్రీశ్రీ తర్వాత తిలక్‌. రచయితల్లో శ్రీపాద, కొడవటిగంటి, మాధవపెద్ది గోఖలే. ఇంకా శరత్‌, ప్రేమ్‌చంద్‌, గొగోల్‌, దొస్తొయెవ్‌స్కీ, నెరూడా, హెమింగ్వే, ఇలియట్‌ - ఇట్లా ఎందరో. విభూతి భూషణ్‌ ‘అరణ్యక’ (వనవాసి) చాలా చాలా ఇష్టం.

ఇంతకీ శివశంకర్‌ మౌలికంగా ఎవరు?
జీవితం అలౌకిక పదార్థం కాదుగాని, అది నిర్వచనాలకి, సూత్రీకరణలకి, సిద్ధాంతాలకి ఒకందాన లొంగదు. మారుతున్న సమాజాన్ని ప్రతిదశలోను కొత్తగా అర్థం చేసుకొంటూ పాత జ్ఞానం విస్తృతం చేసుకొంటూ కొత్త అన్వయాలకోసం ప్రయత్నించాలి. ఇప్పటికీ మనం చాలమట్టుకు పడికట్టు పదజాలంతో ఆడుతూ పరిమిత ప్రమాణాలతో ఉపరితల ప్రయాణమే చేస్తున్నాం. కవి ఇంకా విచ్చుకోవాలి, వెతుకులాడాలి, తను కనుగొనాల్సిం దేదో కనుగొనాలి. వస్తువు అనంతం. అన్వేషించాలి. వస్తురూపాల్లో ఇరుకు చట్రాలు బద్దలు గొట్టాలి. ఈ నెక్కల్లు పిల్లాడిని ఇప్పుడెవరైనా మళ్లీ ఉయ్యాల తొట్టిలో పడేసి, నీ పేరు నువ్వు పెట్టుకొమ్మంటే ఆ పేరు ‘అన్వేషి’.

అన్ని విలువలు పతనమవుతున్న వర్తమానంలో సాహిత్యరంగంలో కవిగా, వ్యక్తిగా ఈ అన్వేషి ఏ విలువల్ని నిల్పుకోవాలని, నిల్పాలని ఆశిస్తున్నాడు?
వ్యక్తిగా అతనిది సరళ జీవనరేఖ. ఈ క్షణం దాక ఎక్కడా వక్రమార్గం లేదు. వ్యసనపరత్వం లేదు. కవి వ్యక్తిత్వం, కవిత్వ వ్యక్తిత్వం వేర్వేరు కాదు. సాహిత్యం ఒకే సమయంలో సాధనం, గమ్యం కూడా. సాధనంగా అది చైతన్యాన్ని, గమ్యంగా ఆనందాన్ని కల్గిస్తుంది. సాహిత్య మంటే సభలు, సభానంతర పానగోష్ఠులు, పైపై మెరమెచ్చులు కాదు. దానికెంతో నిష్ఠ, సమర్పణ అవసరం. ఆ సాధనలోనే శివశంకర్‌ ఉన్నాడు. ఉంటాడు.
ఇంటర్వ్యూ: కొప్పర్తి వెంకటరమణ మూర్తి
98495 25765