Sunday, 21 July 2013
అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత - డా.పాపినేని శివశంకర్

July 22, 2013
ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ ఉంది. ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమం కూడా కన్పిస్తుంది...
మీరు చూసే ఉంటారు. రోడ్డు మీద అపరిమిత జనసందోహం మధ్య ద్విచక్రవాహనం మీద పాతికేళ్ల కుర్రాడు శరవేగంతో పోతుంటాడు. తల పక్కకి వాలిపోయి భుజాన్ని తాకుతుంటుంది. చెవికి, భుజానికి నడుమ ఒక సెల్‌ఫోను అతుక్కుపోయి ఉంటుంది. అతను తన బాస్‌తో ఆ పూట ఆఫీసు పని గురించి మాట్లాడుతున్నాడా, లేక స్నేహితురాలితో సాయంత్రం సినిమా గురించి ముచ్చటిస్తున్నాడా అనేది మన కనవసరం. సదరు ద్విచక్ర వాహన చోదకుడి పరిస్థితిలో చలనవేగం ఉంది. అందువల్ల అస్థిరత ఉంది. అందువల్ల అభద్రత కూడా ఉంది. ద్రవాధునికత (Liquid Modernity) అనే భావనని అర్థం చేసుకోవటానికి ఆ దృశ్యం చక్కని ఉదాహరణ.
ఇప్పటిదాక తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు, అసలు సంగతి దాన్ని మార్చటమే నన్నాడు చాన్నాళ్ల కిందట కార్ల్ మార్క్స్. అయితే కర్త ఎవరో కనపడకుండా విపరీత వేగంతో మారుతున్న ప్రపంచ వ్యవస్థల మధ్య మనమిప్పుడు అవస్థలు పడుతున్నాం. పల్లెల నుంచి పరదేశాల దాక వలసలు, భూసంబంధాల్లో విస్థాపనలు (displacements), మూలాల విచ్ఛిన్నత, రంగులు మారే వస్తు ప్రపంచం, మార్కెట్ సంక్షోభాలు, ఉద్యోగ జీవితాల్లో అభద్రత, ఆధునిక మానవుడి మానసిక గ్లాని -ఇవన్నీ మనల్ని కలవరపెడుతున్నాయి. ఈ అస్థిర వర్తమానాన్ని కొత్తగా అర్థం చేసుకోవటానికి, విశ్లేషించి వ్యాఖ్యానించటానికి జిగ్మంట్ బౌమన్ Zygmunt Bauman) రాసిన 'లిక్విడ్ మోడర్నిటీ' (Liquid Modernity) అనే పుస్తకం ఉపయోగపడుతుంది. ఆ విధంగా మార్పుకి దోహదం చేస్తుంది.
పోలెండ్‌కి చెందిన ఈ సామాజిక తత్వవేత్త, ఆచార్యుడు పాశ్చాత్య తత్వశాస్త్రంతోపాటు సామాజిక శాస్త్రం బాగా అధ్యయనం చేశాడు. కార్ల్ మార్క్స్, మాక్స్ వెబర్, ఆంటోనియోగ్రాంసీ, డెరిడా మొదలైన వాళ్ల ప్రభావాలకు లోనయ్యాడు. వాటికి కొనసాగింపుగా లిక్విడ్ మోడర్నిటీ, లిక్విడ్ లవ్, వేస్టెడ్ లైవ్స్, లిక్విడ్ లైఫ్ పుస్తకాలు రచించాడు.
ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి బౌమన్ రెండు భావనలు రూపొందించుకొన్నాడు. అవే 1. ఘనాధునికత (Solid Modernity) 2. ద్రవాధునికత (Liquid Modernity). (పోస్ట్ మోడర్నిటీ అనే పదంలోని గందరగోళం తప్పించటానికి బౌమన్ లిక్విడ్, సాలిడ్ అనే పదాలు గ్రహించాడు).
ఘన ద్రవ లక్షణాలు: ఘన పదార్థాల్లోని అణువుల మధ్య గట్టి బంధం ఉంటుంది. అది ఆ అణువులు విడిపోకుండా -పదార్థం సడలిపోకుండా- నిరోధిస్తుంది. ప్రత్యేక నిర్మాణ విధానంవల్ల వాటికి ఒక స్థిరత్వం ఉంటుంది. ఘన పదార్థాలు నిలకడగా ఉంటాయి. కొంత స్థలం ఆక్రమిస్తాయి. స్థలమే ప్రధానం, కాలం వాటికి ముఖ్యం కాదు. అంటే చిరకాలం నుంచి అవి అట్లాగే పడి ఉంటాయి. కదలికను లేదా మార్పును ఎదుర్కొనే స్వభావం వాటిల్లో బలంగా ఉంటుంది.
ద్రవ పదార్థాలకు స్థలకాలాల నిర్నిబంధం ఉండదు. అవి తమ ఆకృతిని ఎక్కువకాలం స్థిరంగా నిల్పుకోజాలవు. ఆకృతి మార్పుకు సిద్ధంగా ఉంటాయి. అవి స్థలాన్ని ఎక్కువ (సేపు) ఆక్రమించవు. కాలమే వాటికి ముఖ్యం. ద్రవ పదార్ధాలు తొణుకుతాయి. చిందుతాయి. తేలిగ్గా కదులుతాయి. వేగంగా పరిగెత్తుతాయి. పొర్లుతాయి. ఉప్పొంగుతాయి. ఘనపదార్థాలను ఆపినంత తేలిగ్గా వాటిని ఆపలేం. అవి ఆటంకాల్ని దాటతాయి. కొన్నిటిని తమలో కరిగించుకొంటాయి. కొన్నిటిలోనుంచి ప్రయాణిస్తాయి. అసాధారణమైన ఈ కదిలే గుణం వాటికి తేలికదనాన్నిస్తోంది. ఎల్లప్పుడు కదలికే, అస్థిరతే. వర్తమాన వినూత్న సామాజిక ఘట్టాన్ని ఆకళించుకోవటానికి బౌమన్ ఈ ద్రవత్వం (ఫ్లూయిడిటీ లేదా లిక్విడిటీ) అనే రూపకాన్ని ముఖ్యంగా గ్రహించాడు. ఘన, ద్రవ -ఈ రెండు మాటలకి 'ఆధునికత' అనేది అంటిపెట్టుకొని ఉంది. కనుక ఆధునికతని ముందుగా అర్థం చేసుకొంటే ఆ తర్వాత అందులో వచ్చిన మార్పుని తేలిగ్గా అర్థం చేసుకోగలం.
ఘనాధునికత:
దరిదాపుగా 300 ఏళ్ల నుంచి ఆధునికత (Modernity) ఏర్పడి, కొనసాగిందని బౌమన్ అభిప్రాయం. భౌతికంగా పారిశ్రామిక విప్లవం, భావజాలపరంగా ఫ్రెంచి విప్లవం ఆధునికతకి అంకురార్పణ అనుకోవచ్చు. బిపన్‌చంద్ర కూడ ఈ అభిప్రాయమే వెలిబుచ్చాడు. బౌమన్ ఆలోచనలో స్థలకాల సంబంధంలో మార్పు ఆధునికతకి ప్రారంభ బిందువు. మనిషి జీవనాభ్యాసం నుంచి స్థలకాలాలు విడివడటంతో, అవి పరస్పరం విడివడటంతో ఆధునికత మొదలైంది. అంటే జీవనం ఇంకెంత మాత్రం స్థలకాలాలకు బందీ కాదన్నమాట. అధికారం, ఆధిపత్యం సాధించటానికి త్వరణవేగం ప్రధాన సాధనమైంది. నిబ్బరమైన నడకను తప్పించిన యాంత్రిక ప్రయాణ సాధనాలు నిర్దిష్ట స్థలం నుంచి గొప్ప కదలిక నిచ్చాయి. వేగవంతమైన యాంత్రిక ఉత్పత్తి కాలాన్ని జయించింది; దేశదేశాలకు చేరింది. ఆధునికతకి ఇదొక చిహ్నం.
ఘనాధునికతలో తొలి దశ యిది. ఇందులో కొన్ని కచ్చితమైన నమూనాలున్నాయి. రాజ్యం ఇట్లా ఉంటుంది; వర్తకం ఇట్లా సాగుతుంది; అభివృద్ధి ఈ విధంగా జరగాలి. ఇట్లా కొన్ని నమూనాలు. గత ఉదాహరణల సాయంతో, అనుభవ సంపాదనతో చక్కగా కార్య నిర్వహణ చెయ్యవచ్చని నమ్మిన కాలం అది. గట్టిగా, ఘనాకృతితో అంతగా మారని ప్రపంచంలో ఈ ప్రణాళిక అర్థవంతంగా సాగిందన్నాడు బౌమన్. ఈ దశలో తగినంత సమాచార సేకరణతో, జ్ఞానంతో, సాంకేతిక నైపుణ్యంతో మరింత కచ్చితమైన, హేతుబద్ధమైన ప్రపంచం రూపొందించగలమని మేధావులు భావించారు. 20వ శతాబ్ది తొలి భాగం దాక ఘనాధునికత గురించి, దానిలో రావాల్సిన, రాగల మార్పుల గురించే చర్చించామన్నాడు బౌమన్. ఘనాధునిక దశలో పెట్టుబడిదారు, శ్రామికుల మధ్య, ఇతర వ్యక్తుల మధ్య వైరుధ్యాలతోపాటు దృఢమైన సంబంధాలుండటం గమనించదగింది.
ఈ పరిస్థితిని మన దేశానికి అన్వయించుకుంటే ఇక్కడ వలసవాదుల ద్వారా ఆధునికత ఆలస్యంగా అడుగుపెట్టింది. మేధావులు చాలమందిని ఆధునిక భావజాలం ఆకర్షించింది. అందులో గురజాడ ఒకడు. 'ముత్యాల సరములు'లో ముందు ముందు మేటి వారల మాటలనే మంత్ర మహిమతో జాతి బంధాలు జారిపోతాయని ఆయన అనుకొన్నాడు. 'ఎల్ల లోకము వొక్క యిల్లై, వర్ణ భేదము లెల్ల కల్లై' మనుషుల మధ్య ప్రేమబంధం బలపడుతుందన్నాడు. మతాలన్నీ మాసిపోయి, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందన్నాడు. ఆధునికత ప్రసాదించిన 'జ్ఞానదీపం' స్వర్గలోకాన్ని అంటే ఒక సుఖమయ నూతన ప్రపంచాన్ని- చూపించగలుగుతుందనే నమ్మకం అది.
'కమ్యూనిస్ట్ మేనిఫెస్టో'లో 'melting the solids' అనే మాట ఉంది. దాని అర్థం, ఘనీభవించిన భావజాలం తొలగించి, దాని స్థానంలో సరికొత్తగా అభివృద్ధి చేసిన ఘన-నమూనాలు ప్రతిష్ఠించటమే; మన కాళ్లు చేతులు కట్టిపడేసిన సాంప్రదాయిక విధేయతలు, ఆచారపరమైన హక్కులు తొలగించటమే; అసంబద్ధంగా ఉన్నవాటిని హేతుబద్ధం చెయ్యటమే. ఈ విధంగా ఆధునికతలో రెండోదశ- modernization of modernity-మొదలైందని బౌమన్ గుర్తించాడు. తద్వారా మరింత ఘనీకృత వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఇక్కడ బౌమన్ ప్రజాస్వామ్య, సోషలిస్టు వ్యవస్థలు రెండింటినీ ఉద్దేశించి ఉండవచ్చు.
ద్రవాధునికత :
దాదాపు అర్ధ శతాబ్దం నుండి ఆధునికత ఘనస్థితి నుంచి ద్రవస్థితికి చేరినట్టు బౌమన్ నిర్ధారించాడు. మనదేశంలో ఈ క్రమం ఇటీవలే మొదలైంది. ఇది సాఫ్ట్‌వేర్ పెట్టుబడిదారుల శకం. ఇక్కడ పెద్దపెద్ద యంత్రా లు లేవు. స్థలాన్ని జయించటం లేదు. ప్రపంచమంతా తన ఉక్కురెక్కలు సాచిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి సియాటిల్ నగరమే ఏకైక నిలయం. (ఫ్లోటింగ్ బ్రిడ్జి మీద నుంచి చూస్తే బిల్‌గేట్స్ భవన సముదాయం తప్ప ఫ్యాక్టరీలు, భారీ ఉత్పత్తులు కనపడవు) అంటే పెట్టుబడి కార్ఖానాలు, పెద్ద పెద్ద యంత్రాలు, శారీరక శ్రమ చేసే కార్మికుల్ని వదిలిపెట్టి, కాబిన్ లగేజి వంటి స్వల్ప భారం మోస్తుంది. కనుక ఇప్పుడు పెట్టుబడి ఒక బ్రీఫ్‌కేస్, లాప్‌టాప్, సెల్‌ఫోనులతో ప్రపంచం నలుమూలలకి తేలిగ్గా ప్రయాణించగలదు. ఇది భారరహిత విధానం.
ఈ దశలో పెట్టుబడిదారుకి, ఉద్యోగికి శాశ్వత 'వివాహ బంధం' తెగిపోయి 'కలిసి బతకటం' అనే పద్ధతి వచ్చింది. ఇది తాత్కాలిక సహజీవనం. ఈ బంధం మిక్కిలి బలహీనం. ఎప్పుడైనా పుటుక్కుమనవచ్చు. లేబర్ యూనియన్‌లు లేవు. ఉద్యోగ భద్రత లేదు. అన్ని అస్థిరమైన, కొద్దికాలపు ఉద్యోగాలే. ఇవి రోలింగ్ కాంట్రాక్టులు. ఏ రోజుతో ఉద్యోగానికి మంగళం పాడతారో తెలియదు. కార్పొరేట్ రంగంలో కాంట్రాక్టు లేబర్‌తో పోల్చితే పర్మనెంట్ లేబర్ శతాంశమే.
ద్రవాధునికతలో ద్రవీకృత శ్రామిక విపణిని (fluid labour market) గుర్తించాడు బౌమన్. సాఫ్ట్‌వేర్ తరంలో శ్రామిక వర్గం సడలిపోయిందని, అందువల్ల పెట్టుబడి భారరహితంగా మారిందని, అందువల్ల తేలిగ్గా, వేగంగా కదలగలిగిందని వివరించాడు బౌమన్. తేలికదనం, వేగం వల్ల కలిగే సమస్యలు వేరు. ఈ భారరహిత పెట్టుబడి విధానం విమానయానం వంటిది. పైలట్ క్యాబిన్ ఖాళీగా ఉంటుంది! ప్రయాణికులకు విమానం ఎటు పోతుందో, ఎక్కడ దిగుతుందో తెలియదు. అది క్షేమంగా కిందికి దిగటానికి తామేం చెయ్యగలరో విధివిధానాలు తెలియవు. అయితే ప్రయాణం సులువుగా ఉంటుంది.
ఈ విధానంలో ఉద్యోగి ఒక ప్రాజెక్టు నుంచి యింకో ప్రాజెక్టుకి గెంతుతాడు. ఏ రంగంలోను ప్రత్యేక నైపుణ్యం సంపాదించకుండానే గోళమంతా తిరుగుతాడు. ఎప్పటికప్పు డు పాతది మర్చిపోయి కొత్త ప్రాజెక్టుకి అవసరమైన కొత్త నైపుణ్యం సంపాదించటమే. మారుతున్న ప్రపంచంలో తెలివిగా, హుందాగా, నీతిగా ప్రవర్తిస్తూ విజయం సాధించటమే పెద్ద సమస్య. 'ప్రజలే చరిత్రను నిర్మిస్తారు; కాని అది వాళ్ళకి నచ్చిన పరిస్థితుల నుంచి కాదు' అని కార్ల్ మార్క్స్ ఎన్నడో చెప్పిన మాట ఉదాహరిస్తూ బౌమన్ 'నువ్వు పని చేసే ప్రపంచం నువ్వు నిర్ణయించుకొన్నది కాదు' అన్నాడు. అంటే నువ్వు సాధించాలనుకొన్నదానికి, సాధ్యమయ్యేదానికి మధ్య ఘర్షణ ఉందన్నమాట.
ఇప్పటి కార్పొరేట్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ద్రవాధునిక భావన బాగా ఉపయోగపడుతుంది. కంప్యూటర్లు, అంతర్జాలాలు, సెల్‌ఫోనులు, ఆన్‌లైన్ కాన్ఫరెన్సులు నిండిన ఈ ప్రపంచంలో ఉద్యోగికి స్థలంతో సంబంధం లేదు. అతను బంధరహితుడు, అస్థిరుడు. అతను ఈ దేశంలోనో, అమెరికాలోనో ఉండి పరదేశాల్లో క్లయింటుల అవసరాలు తీరుస్తాడు. తన పని ద్వారా ఏ ఉత్పత్తి జరుగుతుందో అతనికి తెలియదు. తెలియాల్సిన అవసరమూ లేదు. కంటికి కనపడని ఏ లక్ష్యం కోసమో అతను పని చేస్తాడు. తన అసలు యజమానిని అతను కలలోనైనా చూసి ఉండడు. చూసేదల్లా తనపై మేనేజర్లని, తన సమాచారం, లేదా 'జ్ఞానం' అందిపుచ్చుకొనే నలుగురైదుగురు సాటి ఉద్యోగుల్ని. ఆలోచనలు, డిజైన్లు, అంచనాలు తప్ప శరీరంతో చేసే పనేమీ ఉండదు. కీబోర్డు మీటలు నొక్కటమే అతని ప్రధాన శారీరక శ్రమ. కళ్లముందు ఏ ప్రాంతం లేదు. భౌతిక నిర్మాణం లేదు. ఉన్నదంతా కంప్యూటర్‌లో కనపడే ఆభాస వాస్తవికతే (virtual reality). ఈ సరికొత్త ప్రపంచాన్ని, అందులోని అస్థిర సంబంధాల్ని మన రచయితలు లోతుగా అన్వేషించాల్సి ఉంది.
ద్రవాధునికతలో ప్రపంచీకరణ ఉంది; వలసలున్నాయి. సంచార జీవనం ఉంది; అంతర్జాలం ఉంది; సెల్‌ఫోన్లు ఉన్నాయి. జీవితంలో మార్పు అనేది ఇవాళ 'శాశ్వత' పరిస్థితి. మార్పు లేని గానుగెద్దు పద్ధతి ఇంక కుదరదు. ఏదో ఒక గత ఉదాహరణని అనుసరించటం 'మంచిది' కాదు. జ్ఞానం సంపాదించి, దానిమీదనే ఆధారపడటం ఇవాళ 'తెలివైన ప్రతిపాదన' కాదు. అంటే ఏవో కొన్ని స్థిరమైన అభిప్రాయాలను అంటిపెట్టుకొని బ్రతకటం గాక ఎప్పటికప్పుడు మారే పరిస్థితుల కనుగుణంగా మారుతూ పోవటమే నేటి జీవన విధానంగా బౌమన్ గుర్తించాడు. ఈ జీవన విధానంలో 1. అపాయం, 2. అస్థిరత్వం, 3. దుర్బలత్వం (vulnerability) అనే లక్షణాలు కూడా గమనించాడు. అభద్రతే వాటి సారాంశం. అయితే సామాజిక శాస్త్ర వికాసంతో, నిర్ణయ స్వేచ్ఛతో కూడిన ఉన్నత సమాజంలో మనుషులు తమ జీవితాల్ని అర్థవంతం చేసుకోగలరని బౌమన్ ఆశించాడు.
ద్రవాధునికత వంటి కొత్త భావనల్ని (లేదా ప్రత్యయాల్ని) మన సమాజ, సాహిత్యాలకు అన్వయించుకున్నప్పుడు నూతన విశేషాలు బయటపడతాయి. సంకీర్ణ సమాజం మనది. దీనికి గ్రాహ్యత (absorption), జీర్ణీకరణ (assimilation) స్వభావం ఎక్కువ. దీనిలో పూర్వాధునిక లక్షణాలు ఎట్లాగూ ఉన్నాయి. పూర్వాధునికత నుంచి ఆధునికతకి సాగే క్రమమూ ఉంది. ఆధునికత నుంచి ద్రవాధునికతకి సాగే క్రమం కూడా కన్పిస్తుంది. ముఖ్యంగా విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ఈ సరికొత్త పరిణామాన్ని తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాద ఘంటికలూ వినగలం. ప్రపంచీకరణకి, ద్రవాధునికతకి గల రక్త సంబంధాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంది. ఈ గుర్తింపు మన సాహిత్య వస్తువులో నూతన ఆవిష్కరణలకి దారి తీస్తుందని నా నమ్మకం.

No comments:
Post a Comment