Wednesday, July 10, 2019

ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే !

ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే !
హైదరాబాద్
10 జులై 2019
డా. జి వి పూర్ణచందు గారూ !
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సమాచార పత్రం అందింది. ధన్యవాదాలు.
'తెలుగు నేలపైన మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ' ను ఈ సభల థీమ్ గా ఎంచుకున్నందుకు ముందుగా నిర్వాహక సంఘానికి అభినందనలు.
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) కన్వీనర్ గా ఈ సందర్భంగా ఒక ముఖ్య అంశాన్ని మీ దృష్టికి తీసుకుని రావడం అవసరమని అనుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్ ముస్లింల మాతృభాష ఉర్దు. రాష్ట్రంలో ఉర్దూ వికాశానికి అవకాశాలు రోజురోజుకూ కృశించిపోతూ వుండడంతో ఈ ప్రాంతంలోని ముస్లింలకు తెలుగు పొట్టకూటి భాషగా మొదలయ్యి క్రమంగా మాతృభాషగా మారిపోతున్నది. ముస్లిం సామాజికవర్గానికి చెందిన అనేకమంది జానపద కళా రూపాలు, కవిత్వం, కథ నవల, వ్యాస ప్రక్రియలల్లో తెలుగును సుసంపన్నం చేశారన్నది చేస్తున్నారన్నది మీకు తెలియని విషయం కాదు.
తెలుగు నేల మీద మాట్లాడుతున్న అనేక భాషల ప్రస్తావన మీ సమాచార పత్రంలో వుంది. "కొన్ని మాతృభాషలు మాట్లాడే వ్యక్తుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీరి తరువాత ఆ భాష పూర్తిగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోన్న పరిస్థితి" అని మీరు వ్యక్తం చేసిన ఆవేదన మహత్తరమైనది.
రాష్ట్రంలో అంతరించిపోతున్న భాషల్లో ఉర్దూ కూడా ఒకటి. ఉర్దూ భాష ఔన్నత్యం గురించి వివరంగా చెప్పడానికి ఇది సందర్భం కానప్పటికీ ఒక అంశాన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావలసి వున్నది. ఇప్పుడు మనం ఆదరిస్తున్న ఆధునిక భావాలను జాతియోద్యమ కాలంలో ముందుకు తెచ్చిన ఘనత ఉర్దూ భాషది. The Anjuman Tarraqi Pasand Mussanafin-e-Hind అనే Progressive Writers' Movement of India or Progressive Writers' Association ద్వార 1932లో ఇది ఆరంభమయింది. ఇప్పుడు మనం ఆధునిక భావాలను ఆదర్శంగా పేర్కొంటూ ఉర్దూ భాషను తన చావుకు వదిలివేయడం భావ్యం కాదు.
ఒక భాషను చంపివేయడం అంటే ఒక జాతిని రక్తరహితంగా చంపివేయడమే అనే మానవ జీవన శాస్త్ర సూత్రం మీకు తెలియనిది కాదు.
మీ సమాచార పత్రంలో ఉర్దూ భాష ప్రస్తావన లేకపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. మరో అంశం ఏమంటే ప్రపంచ తెలుగు రచయితల సంఘం వ్యవస్థాపక కార్యవర్గంలో హిందూయేతరుల పేరు ఒక్కటీ కనిపించలేదు. తెలుగు భాష అంటే ఆంధ్రప్రదేశ్ డయాస్పోరాకు చెందిన హిందువుల భాష అని ప్రపంచ తెలుగు రచయితల సంఘం భావిస్తుంటే తెలుగు భాషకు అంతకన్నా చారిత్రక అపచారం మరొకటి వుండదు. తెలుగును మత భాషగా మార్చకండి.
తెలుగు సమాజంలోని ప్రధాన స్రవంతి మాత్రమేగాక ఎస్టీ, ఎస్సీ, బిసి, మైనారిటీలు కూడా తెలుగు భాషనే మాట్లాడుతారు. అంతేకాదు, సంఖ్యరీత్యానూ ఉపస్రవంతి ప్రధాన స్రవంతికన్నా చాలా పెద్దది. మీ కార్యవర్గంలో సోషల్ ఇంజినీరింగ్ పూర్తిగా లోపించింది. ఉపస్రవంతిని మినహాయించడం భాషా సాహిత్యరంగాల్లో సామాజిక మహాపచారం.
సభ్యత్వ రుసుము రెండు వేల రూపాయలు చాలా ఎక్కువగా వుంది. ప్రతినిధులు తమ వసతిని ఏర్పాట్లు తామే చేసుకోవాలని మరో షరతు పెట్టారు. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్ని మీరు ఎగువ మధ్యతరగతి వ్యవహారంగా మార్చడమేగాకుండా, సామాన్యుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నారనిపిస్తున్నది. సామాన్య తెలుగు భాషాభిమానులు సహితం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించగలరు.
2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా యునెస్కో చేసిన ప్రకటనకు స్పందించి ఈ మహాకార్యాన్ని చేపట్టినందుకు మీకు ఇంకోసారి అభినందనలు. మీ ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటాను.
అభినందనలతో
ఉష యస్ డానీ
Writer, Journalist, Social Analyst, communal harmony volunteer, Political Commentator and Humorist

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో
పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడ-
సమాచార పత్రం1

తెలుగు నేలపైన మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ లక్ష్యంగా
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
నమస్కారం!
తెలుగు భాషతోపాటు తెలుగు నేలపైన అనేక మాతృభాషలు ఉన్నాయి. కోలమి, కోయ, గోండి, కువి, కుయి, యెరుకల, సవర, పర్జి, కుపియా, లంబాడీ ఇంకా ఇతర భాషలు మాతృ భాషలుగా కలిగిన ప్రజలు మనతోనే తెలుగువారు గానే జీవిస్తున్నారు. తెలుగుతోపాటుగా ఈ మాతృభాషలన్నీ ప్రపంచీకరణం కోరల్లో చిక్కుకుని విలవిల లాడ్తున్నాయి.
మాతృభాష అనేది వ్యక్తి ఉనికిని, సాంస్కృతిక అస్తిత్వాన్ని, వారసత్వాన్ని నిరూపిస్తుంది. మానవ మనుగడకు మాతృభాష అత్యంత ముఖ్యమైన అంశం. అది కేవలం సమాచారం, వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాల కోసం, విద్య కోసం, సామాజిక సంబంధాల కోసం మాత్రమే ననే భావన ప్రబలటం వలన ఈ పరిస్థితి వచ్చింది.
కొన్ని మాతృభాషలు మాట్లాడే వ్యక్తుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. వీరి తరువాత ఆ భాష పూర్తిగా తన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోన్న పరిస్థితి. ఇప్పటికే మాతృభాష లెన్నో మనకు తెలీకుండానే అంతరించిపోయాయి. దీని గురించి అందరం ఆలోచించ వలసిన సమయం ఇది.
మాతృభాషలన్నింటినీ ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి అనుసంధానం చేసి, భాషావేత్తలు, పండితులు, విద్యా వేత్తలు, సాంకేతిక నిపుణుల సహకారంతో వాటిని పదిలపరిచే ప్రయత్నాలు ప్రారంభం కావాలి.
ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో 2019వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాతృభాషల పరిరక్షణ వైపు దృష్టి సారించ వలసిందిగా తెలుగు ప్రభుత్వాలతో పాటు, ప్రజల గుండె తలుపులు తట్టటం లక్ష్యంగా 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి.
కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో 2007లో తెలుగు భాషోద్యమ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. 2011లో ‘ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు’ అనే అంశంపై రెండవ తెలుగు రచయితల మహాసభలు, 2015లో ‘తెలుగు భాషాభివృద్ధి-యువత’ అంశంపై 3వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవంతంగా జరిగాయి. దేశ, విదేశాల నుండి ఎందరో తెలుగు ప్రముఖులు ఈ మహాసభలలో పాల్గొన్నారు.
2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ ప్రధాన అంశాలుగా 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగనున్నాయి. విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాల ప్రాంగణం ఈ మహా సభలకు వేదిక కానుంది.
యునెస్కో సంస్థ పిలుపు తరువాత ఈ మహాసభల ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకుని సాహితీ, పాత్రికేయ రంగాల ప్రముఖులు ఎందరో ఇది ఒక తక్షణావసరంగా భావిస్తున్నారు. ఈ మహాసభల సంకల్పానికి వారందించిన ప్రేరణే కారణం
ప్రాంతాల కతీతంగా ప్రపంచంలో ఎల్లెడలా విస్తరించి, ప్రతిభా పాటవాలతో రాణిస్తున్న తెలుగు భాషాభిమానులనూ, సాహితీమూర్తు లందరికీ స్వాగతం పలుకుతున్నాం. అనుకూలంగా స్పందించ వలసిందిగా కోరుతున్నాం.
ప్రభుత్వాలలోనూ, ప్రజలలోనూ కదలికను తెచ్చేవిగా ఈ మహాసభలు జరగాలని మా ఆకాంక్ష. భాష కోసం జరిగే ఈ యఙ్ఞంలో మీరూ భాగస్వాములు కావాలి.
ఈ మహాసభలలో...
• తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్రం మరియు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించేలా నూతన విధాన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి...
• అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష విషయంలోనూ అనుసరింప చేయటానికి అవకాశాల గురించి...
• రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల గురించి...
• రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పన, ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూనికోడ్, పదకోశాల అభివృద్ధి, తెలుగు విద్యార్థులకు, అధ్యాపకులకు ప్రోత్సాహకాలు, ఆచరణకు నోచుకోని ఇంకా అనేక అంశాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళటం గురించి...
• యేళ్ల తరబడీ నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యస్థను పటిష్ఠ పరచి, సాహితీ విలువలు కలిగిన గ్రంథాలను కొనుగోలు చేయటం గురించి...
• తెలుగు నేలపైన ప్రతీ విశ్వవిద్యాలయంలోనూ మాతృభాషల పీఠాలు ఏర్పరచి, ఆయా విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న జాతుల మాతృభాషల పరిరక్షణ కోసం కృషి చేయటం గురించి…
• తమిళనాడు, ఒడిసా, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవటంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, తెలుగు నేర్చుకోవటానికి కావలసిన పుస్తకాలు ఇతర ఉపకరణాల అందజేత, భాషాపరంగా అక్కడి సమస్యల గురించి...
ఇంకా ఇతర సాహిత్య, సామాజిక అంశాల గురించి చర్చలు జరుగుతాయి. భాషోద్యమ స్ఫూర్తితో పాల్గొన వలసిందిగా అందరికీ ఆహ్వానం.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం
2007 విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల ప్రధమ మహాసభలలో ప్రపంచస్థాయి కలిగిన ఒక తెలుగు రచయితల సంఘాన్ని నిర్మించి, నిర్వహించే బాధ్యతలను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానం ద్వారా “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పడింది. 2011 రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 2015లో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మరియు కృష్ణాజిల్లా రచయితల సంఘం సంయుక్తాధ్వర్యంలో ఒక కార్యనిర్వాహక మండలి ఏర్పడి విజయవాడలో మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ఘనంగా నిర్వహించింది. ఈ మహాసభలలో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో రిజిష్టర్ చేయించే బాధ్యతను కృష్ణాజిల్లా రచయితల సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు.
2019లో ప్రపంచ తెలుగు రచయితల సంఘాన్ని తాత్కాలిక కార్యవర్గంతో విజయవాడలో రిజిష్ట్రేషన్ చేయించటం జరిగింది. రేపటి మహాసభల నాటికి ప్రపంచ తెలుగు రచయితలసంఘం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సభ్యులతో, సంపూర్ణ కార్యవర్గంతో అంతర్జాతీయ సంస్థగా రూపు దిద్దుకోగలదని ఆకాంక్షిస్తున్నాము.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలు, తెలుగు భాషాభిమానులను సమైక్యపరచటం ద్వారా తెలుగు భాషాసంస్కృతులను, సాహిత్యాన్ని విశ్వవ్యాపితం చేయటం “ప్రపంచ తెలుగు రచయితల సంఘం” లక్ష్యం. తెలుగు భాష, సంస్కృతుల ప్రాచీనతను నిరూపించే చారిత్రక పరిశోధనలను ప్రోత్సహించటం, తాజా పరిశోధనల సారాంశాన్ని తెలుగు ప్రజలకు అందించటం ద్వారా తెలుగుపట్ల జనానురక్తిని పెంపుచేసే కృషిలో ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది.
ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో నివసిస్తున్న సాహిత్యాభిమానులైన తెలుగువారి సంస్థగా నిలవాలని మా కోరిక. అన్ని తెలుగు సాహిత్య ప్రక్రియలకూ ఈ సంస్థ సమప్రాధాన్యం ఇస్తుంది. తెలుగును ప్రపంచ తెలుగుగా తీర్చి దిద్దే కృషిలో అందరం భాగస్వాములం కావాలని ఆకాంక్షిస్తున్నాం. మీకు స్వాగతం పలుకుతున్నాం.
“ప్రపంచ తెలుగు రచయితల సంఘం”లో రూ. 2000/- (విదేశాలలోని తెలుగు వారికి US 50$) చెల్లించి, జీవిత సభ్యులుగా చేరటం ద్వారా ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో సహకరించ ప్రార్థన.
ప్రపంచ తెలుగు రచయితల సంఘం వివరాల కోసం వెబ్‘సైట్ చూడగలరు. ఈ వెబ్‘సైట్లో సభ్యత్వ నమోదు దగ్గర క్లిక్ చేసి, నమోదు ఫారాన్ని పూర్తి చేసి, సబ్‘మిట్ చేయగలరు. పూర్తిచేసిన ఈ ఫారం అందగానే మీ సభ్యత్వం అంగీకరించ బడిన వైనం మీకు తెలియజేయగలం. మీ సెల్‘ఫోను లోంచి కూడా సభ్యత్వ నమోదు చేయవచ్చు. అందుకు అవకాశం లేనివారు లిఖిత పూర్వకంగా కూడా పంపవచ్చును.
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కార్యక్రమం
జాతీయ తెలుగు ప్రముఖులు, వివిథ భాషలలో ఙ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, ప్రసిద్ధ సాహితీవేత్తలు, పాత్రికేయ ప్రముఖులు ఇంకా అనేక మందిని ఈ మహాసభలకు ఆహ్వానిస్తున్నాం. కవులు, కథకులు, నాటక రచయితలు కళాకారులు, వివిధ రంగాలకు చెందిన భాషాభిమానులైన ప్రతీ ఒక్కరినీ ఈ సంస్థలో జీవిత సభ్యులుగా ఆహ్వానిస్తున్నాం.
ఇది మన కార్యక్రమం, అందరం కలిసి ఒక గురుతర బాధ్యత వహిస్తున్నామని భావించి స్వచ్ఛందంగా 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ప్రతినిథిగా నమోదు కావలసిందని విఙ్ఞప్తి. సానుకూలంగా స్పందించ ప్రార్థన.
ప్రతినిథులకు సూచనలు
1. ‘2019 డిసెంబరు 27,28,29 తేదీలలో విజయవాడలో జరగనున్న 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల కోసం రూ.500/- చెల్లించి ప్రతినిథులుగా నమోదు కావలసిందిగా కోర్తున్నాం.
2. ప్రపంచ తెలుగు రచయితల సంఘంలో సభ్యులుగా సభ్యత్వ రుసుము రు.2,000/-(విదేశాలలోని వారు US 50$) చెల్లించినవారికి ఈ మహాసభలలో ప్రతినిధి రుసుము లేకుండా రాయితీ కల్పిస్తున్నాం. ప్రపంచ తెలుగు రచయితల సంఘం సభ్యులందరూ ఈ మహాసభల ప్రతినిధులే!
3. ప్రతినిధి రుసుము లేదా సభ్యత్వ రుసుములను నేరుగా బ్యాంకులో ఆన్‘లైన్ ద్వారా చెల్లించే సదుపాయాన్ని సాంకేతిక ఇబ్బందుల కారణంగా ప్రస్తుతానికి విరమించుకుంటున్నాము.
4. డిడిలను PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగాను, చెక్కులను ప్రపంచ తెలుగు రచయితల సంఘం పేరున వ్రాయాలి. యం.ఓ.లు మాత్రం చేయకండి.
5. మీ సమాచారాన్ని పోష్టుద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారా పంపండి. వాట్సాప్, ఫేస్‘బుక్, ఎస్సెమ్మెస్ మొదలైన ఇతర సామాజిక మాధ్యమాల్లో పంపవద్దని మనవి.
6. డిడిలను, చెక్కులను పంపవలసిన చిరునామా:
కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితలసంఘం
1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా,
గవర్నర్ పేట, విజయవాడ-520002.
7. ప్రతినిధులుగా నమోదు కావటానికి చివరి తేదీ 2019 డిసెంబరు1.
8. ప్రతినిధులకు మాత్రమే మహాసభల ప్రాంగణంలో భోజన, ఉపాహారాలుంటాయి.
9. ప్రతినిధులు తమ వసతి ఏర్పాట్లు తామే చేసుకోవలసి ఉంటుంది. సభాస్థలికి దగ్గరగా ఉన్న హోటళ్ల టెలిఫోన్ నెంబర్ల పట్టికను ప్రతినిధులకు రసీదుతోపాటు పంపగలం.
10. సభల సమయంలో స్పాట్ రిజిస్ట్రేషన్లు ఉండవు. సాధ్యమైనంత ముందుగానే ప్రతినిధిగా నమోదు కావాల్సిందిగా విన్నపం. గత అనుభవాల రీత్యా అప్పటికప్పుడు వచ్చి పేర్లు నమోదు కోసం, ఙ్ఞాపికలు, ఇతర సౌకర్యాల కోసం నిర్వాహకుల పైన వత్తిడి చేయవద్దని ప్రార్థిస్తున్నాము.
ప్రతినిధులు సభాస్థలికి సమయానికంటే ముందుగా వచ్చి తమ ప్రతినిధి రుసుము రసీదు చూపించి రిజిష్టర్ కావలసిందిగా కోరుతున్నాం.
మహాసభల ప్రతినిధులతో మాత్రమే కవిసమ్మేళనాలు, ఇతర సాహిత్య కార్యక్రమాలూ జరుగుతాయి. ప్రతినిధులుగా నమోదయిన వారికి ప్రసంగాలలోనూ, పత్ర సమర్పణలలోనూ ప్రధమ ప్రాధాన్యం ఉంటుంది.
ఈ మహాసభల కోసం ప్రత్యేకంగా ‘ప్రపంచతెలుగు’ వ్యాస సంపుటి వెలువరిస్తున్నాం. ఇందులో తెలుగు భాష, తెలుగుతో ముడిపడి జీవిస్తున్న ఇతర మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణలతో పాటు ఈ మిలీనియం 20 యేళ్ల కాలంలో భాష పరంగా జరిగిన కృషి గురించీ, తెలుగు సాహిత్యం తీరుతెన్నుల గురించీ పరిశోధనా వ్యాసాలుంటాయి.
సభా వేదికపైన వీలుని బట్టి రచయితలు తమ రచనలను ఆవిష్కరింప చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
మహాసభల సమాచారాన్ని మీ సాహితీ మిత్రులకూ తెలుపండి. రచయితలు, భాషాభిమానులు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాసభలు విజయవంతం కావటానికి సహకరించండి.
మీ అమూల్యమైన సలహాలను, సూచనలను అందించగలరు.
మాతో కలిసి నడుస్తూ తోడ్పాటు నందించిన సాహితీ మిత్రుల్ని ఈ మహాసభలలో సముచిత రీతిని గుర్తించి, గౌరవించగలమని మనవి. సంప్రదింపులకోసం:
ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యాలయం,
1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా,
గవర్నర్ పేట, విజయవాడ-520002
వెబ్ సైట్: http://www.prapanchatelugu.com
ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com
సెల్: 9440167697, 9440172642
ప్రపంచ తెలుగు రచయితలసంఘం వ్యవస్థాపక కార్యవర్గం

గౌరవాధ్యక్షులు: డా. మండలి బుద్ధప్రసాద్
గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు: ఆచార్య యార్లగడ్డ
లక్ష్మీప్రసాద్
అధ్యక్షులు: శ్రీ గుత్తికొండ సుబ్బారావు
ఉపాధ్యక్షులు: శ్రీ గోళ్ల నారాయణ రావు
కార్యదర్శి: డా. జి వి పూర్ణచందు
సహాయకార్యదర్శి: డా. గుమ్మా సాంబశివరావు
కోశాధికారి: శ్రీ టి శోభనాద్రి
కార్యనిర్వాహకవర్గ సభ్యులు:
డా. ఈమని శివనాగిరెడ్డి
డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
డా. వెన్నా వల్లభరావు
శ్రీ పంతుల వెంకటేశ్వర రావు
శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి
శ్రీమతి పుట్టి నాగలక్ష్మి